Local Body Elections: ఊగుతున్న ఊళ్లు
ABN , Publish Date - Dec 10 , 2025 | 07:52 AM
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో మద్యం, మటన్, విందులతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ఖర్చుల్లో ఎక్కువ భాగం మద్యంపైనే వెచ్చిస్తున్నారు. అభ్యర్థులు ప్రలోభాల ద్వారానే అధికంగా ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కిక్కెస్తున్న పంచాయతీ ఎన్నికలు
నాటు కోడి, మటన్, బోటి, తలకాయ సూపు, చికెన్ ఫ్రైతో అభ్యర్థుల కాక
చీప్ లిక్కరు నై.. బ్రాండెడ్ విస్కీకే సై.. షాపుల్లో క్వార్టర్స్‌కు ఫుల్ డిమాండ్
మద్యానికే రూ. లక్ష నుంచి రూ.5లక్షలకు పైగా వ్యయం
ఉమ్మడి జిల్లాలో రూ.60కోట్లకు పైగా మద్యంపైనే ఖర్చు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్: పంచాయతీ పోరు పల్లెను మత్తెక్కిస్తోంది. రాత్రైతే చీర్స్‌తో ఊరు చిందులేస్తోంది. పెద్ద మనుషులు, కుల, యువజన సంఘాల మద్దతు కోసం అభ్యర్థులు మందును ఎరగా వేస్తున్నారు. మనీకి లొంగని నేతలను మద్యంతో తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పొద్దంతా ప్రచారంలో వెంట తిరిగే క్యాడర్న్‌ను చీకటి పడితే చాలు మందు, విందులతో చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికల ఖర్చులో సగానికి పైగా మద్యం కోసం అభ్యర్థులు వెచ్చిస్తున్నారు. మొదటి విడత ప్రచారం పూర్తి కావటంతో ఇక మద్యంతో పాటు ఇతర ప్రలోభాలతో ఓటర్లకు ఎర వేసే పనిలో అభ్యర్ధులు బిజీగా ఉన్నారు.
ఖర్చులకు తగ్గేదేలే..
ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు చాలా చోట్ల ఖర్చులకు తగ్గేదేలే అంటున్నారు. ఎన్నికల ప్రచారాన్ని అసెంబ్లీ ఎన్నికలకు తీసిపోకుండా నిర్వహిస్తున్నారు. ప్రచార వాహనాలతో పాటు కొన్నిచోట్ల అభ్యర్థులు ఎల్డీ స్క్రీన్లను కూడా వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను రంగంలోకి దించి ప్రచారం చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు.. ఒక్కసారి ఊరికి సర్పంచ్ కావాలే.. అనే లక్ష్యంతో ఓట్ల కోసం నోట్లను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. వలస వెళ్లిన ఓటర్లకు ప్రత్యేకంగా వాహనాలు, ఇతర ఖర్చులు కూడా సర్దేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. రిజర్వేషన్ కలిసి వచ్చిన వాళ్లు అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?