Local Body Elections: పల్లెల్లో ఆత్మీయ పలకరింపులు.. జోరుగా విందులు
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:30 AM
గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్ల అవసరాలను తీరుస్తూ గెలిస్తే పథకాలు ఇప్పిస్తామని ఆశ చూపుతూ ఓటు వేయాలని కోరుతున్నారు.
హుజూరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలెల్లో ఆత్మీయ పలకరింపులు మొదలయ్యాయి. గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందులు జోరందుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం కావడంతో వలస వెళ్లిన వారికి ఫోన్లు చేసి అన్నా నమస్తే.. బాబాయ్ నమస్తే.. అంటూ గ్రామానికి వచ్చి తమకు ఓటు వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రామానికి వస్తే రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు. ఉదయం వేళల్లో ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్ధులు మధ్యాహ్నం కాగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు మందు, విందు ఏర్పాటు చేస్తు న్నారు.
ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన వారిని సాయంత్రం కలిసి తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు. హుజూరాబాద్ డివిజన్లో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఐదు మండలాల్లో జరుగుతున్నాయి. మంగళవారం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులను విత్ డ్రా చేసుకోవాలని కొందరు కోరుతున్నారు. ఉపసంహరించుకుంటే డబ్బులు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు..
పోటీలో ఉందామా.. తప్పుకుందామా...
డివిజన్‌లో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగుస్తుంది. దీంతో కొందరు అభ్యర్థులు పోటీలో ఉందామా.. తప్పకుందామా అని కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చిస్తున్నారు. ఖర్చు పెరిగిపోవడం, గతంలో ఉన్న సర్పంచ్లకు బిల్లులు రాకపోవడంతో కొందరు అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. జనరల్ స్థానాల్లో కులాల వారీగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. కులాల సంఘాల నాయకులకు విందులు, వినోదాలు ఏర్పాటు చేసి, నమ్మిన దేవుళ్లపై ఒట్టేయించుకుని మద్దతు కూడగట్టుకుంటున్నారు.
సర్పంచ్లకు నామి నేషన్లు వేసిన చాలా మంది పోటీకి మొగ్గు చూపుతున్నారు. మరి కొందరు పోటీ లేకుండా ఉండేందుకు. ఆర్థిక అంశాలను ఆశ చూపి తమ వైపు తిప్పుకు నేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మద్యం గ్రామాల్లో ఏరులై పారుతోంది. మంగళవారంతో ఉపసంహరణ గడువు ముగుస్తుండడంతో అదికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తున్నారు.
గెలుపు కోసం పడరాని పాట్లు...
గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్ల అవసరాలను తీరుస్తూ గెలిస్తే పథకాలు ఇప్పిస్తామని ఆశ చూపుతూ ఓటు వేయాలని కోరుతున్నారు. వృద్ధాప్య, వితంతువు పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. గ్రామాల్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని ఓట్లు అడుగుతున్నారు.
ఇవి కూడా చదవండి
వేడెక్కిన పంచాయితీ ప్రచారం.. గ్రామాల బాటపడుతున్న ముఖ్య నేతలు..
ఎన్నికల వేళ.. అభ్యర్థులకు హెచ్చరిక!