Share News

Local Body Elections: ఎన్నికల వేళ.. అభ్యర్థులకు హెచ్చరిక!

ABN , Publish Date - Dec 09 , 2025 | 07:04 AM

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎలాగైనా గెలవాలని రకరకాల ప్రలోభాలు చేయడం ముమ్మరంగా జరుగుతోంది. డబ్బు, మద్యం పంచడం, బెదిరించడం, తప్పుడు ప్రచారం చేయడం వంటి చర్యలు నేరంగా పరిగణస్తారు. ఎన్నికల సమయంలో ఈ ప్రవర్తనలకు కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తారు.

Local Body Elections: ఎన్నికల వేళ.. అభ్యర్థులకు హెచ్చరిక!
Local Body Elections

  • అభ్యర్థులు.. ప్రజలకు డబ్బులిచ్చినా, బెదిరించినా నేరమే

  • జైలు శిక్షతో పాటు జరిమానాలు తప్పవు


అశ్వారావుపేట రూరల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఓటు అనేది వజ్రాయుధం వంటిది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అద్దం పడతాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రధానంగా ఓటర్లకు డబ్బు, మద్యం పంచడం, బెదిరింపులకు పాల్పడటంతో పాటు ఎదుటి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేయడం వంటి ప్రలోభాలకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల వేళ పల్లెల్లో రకరకాల ప్రలోభాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల వేళ ఇటువంటి ప్రలోభాలకు పాల్పడితే భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)- 2023 యాక్ట్ ప్రకారం పలు శిక్షలతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఎన్నికల వేళ ఎవరైనా నేరాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తారు. నేరం నిరూపణ అయితే తగిన శిక్షలు విధిస్తారు.


డబ్బుతో ప్రలోభ పెట్టడం..

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు.. ఓటర్లకు డబ్బులు ఆశ చూపడం, మద్యం బాటిళ్లు ఇవ్వడంతో పాటు వస్త్రాలు, బహుమతులు ఇచ్చి ఓటు అడగటం నేరం. ఎన్నికల సమయంలో ఇటువంటివి జరుగుతున్నట్లు ఎన్నికల అధికారుల దృష్టికి వచ్చినపుడు విచారణ చేపడతారు. ఒకవేళ నేరం రుజువు అయితే సెక్షన్ 171బీ కింద ఏడాది పాటు జై లు, జరిమానా విధిస్తారు. అభ్యర్థులతో పాటు ఓటు కోసం డబ్బులు తీసుకున్న వారికీ శిక్ష విధించవచ్చు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరుఫున ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే చర్యలు తప్పవు.


తప్పుడు ప్రచారం చేసినా..

బరిలో నిలిచిన అభ్యర్థులపై కొందరు దుష్ప్రచారాలు చేస్తుంటారు. ఫలితాలను ప్రభావితం చేసేలా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి వ్యక్తిత్వం గురించి ప్రచారాలు చేస్తుంటారు. అభ్యర్థికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని, స్మగ్లర్ అని, నేరాలు చేశాడని, మంచివాడు కాదని ప్రచారాలు చేస్తుంటారు. ఇలా ప్రచారాలు చేయడం కూడా నేరంగానే పరిగణిస్తారు.


దొంగ ఓట్లు వేయటం..

పోలింగ్ వేళ చనిపోయిన వారి పేరు మీద దొంగ ఓట్లు వేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మారు పేరుతో ఓటు వేయడం, ఒకసారి ఓటు వేసినా మరోసారి ఓటు వేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు దొంగ ఓట్లను వేసేలా ఇతరులను ప్రోత్సహించటం కూడా చేస్తుంటారు. ఇవి కూడా ఎన్నికల వేళ తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి ఏడాది పాటు జైలుశిక్ష ఉంటుంది.


బెదిరింపులు, ఒత్తిడి చేయడం..

అభ్యర్థులు వారికి అనుకూలంగా ఓటు వేయాలని ఓటర్లను బెదిరిస్తుంటారు. వారిపై వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తుంటారు. ఇది కూడా నేరంగానే పరిగణిస్తారు. 171సీ కింద కేసు నమోదు చేసి విచారణ చేపడతారు. ఇది నిరూపణ అయితే ఏడాది జైలు శిక్ష పడే ఆవకాశం ఉంది. జరిమానాలు విధిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం

87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!

Updated Date - Dec 09 , 2025 | 07:04 AM