Share News

Local Body Elections: నోటికి తాళం.. నోట్లతో గాలం!

ABN , Publish Date - Dec 10 , 2025 | 07:21 AM

వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన తర్వాత, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాగా అధికారులు పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 11న పోలింగ్ జరుగనుంది.

Local Body Elections: నోటికి తాళం.. నోట్లతో గాలం!
Local Body Elections

వరంగల్ సిటీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల పరిధిలో మంగళవారం సాయంత్రం నుంచి ప్రచార గడువు ముగిసింది. గత నెల 27న నామినేషన్లతో మొదలై.. 9న ఎన్నికల ప్రచారం తంతు ముగిసింది. 91 గ్రామాలు, 800 వార్డులకు జరిగే ఎన్నికల్లో 11 మంది సర్పంచ్లు, 215 మంది వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు. కాగా మిగితా గ్రామాలకు చెందిన 299 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1318 మంది వార్డ్ మెంబర్లు పోటీ పడుతు న్నారు. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీ మద్దతు దారులను గెలిపించుకునేందుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాయపర్తి మండలంలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు వర్ధన్న పేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలలో విస్తృతంగా పర్యటించారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్యెల్యేలు అరూరి రమేష్, కొండేటి శ్రీధర్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు.


ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ..

తొలి విడత ఎన్నికల ప్రచారంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు పలు చోట్ల చేదు అనుభవం ఎదురైంది. పర్వతగిరి మండలం దౌలత్‌నగర్‌లో ప్రచారం చేస్తుండగా రెబల్ అభ్యర్థి కూడా ప్రచార రథం ఎక్కే ప్రయత్నం చేయడంతో కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఎమ్మెల్యే నాగరాజు ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు.


ప్రలోభాల ఎర

ప్రచారానికి తెరపడడంతో అభ్యర్థులు ఓటర్లకు ప్రలోభాల ఎర వేస్తున్నారు. ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు తాయిలాలు అందజేస్తున్నారు. ఓటర్లకు మందు సీసాలు, మటన్, చీరలు, మిక్సీలు, డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంగళ, బుధవారం రాత్రిలోగా ఓటర్లకు అన్ని అందేలా గుట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


పోలింగ్‌కు ఏర్పాట్లు

ఈ నెల 11న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 800ల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా అధికారులను, సిబ్బందిని నియమించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు మఫ్టీలో తిరుగుతూ పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.


ఇవీ చదవండి:

Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?

అతడి వికెట్ కీలకం: మార్‌క్రమ్

Updated Date - Dec 10 , 2025 | 07:42 AM