Share News

Jubilee Hills Bypoll: ఓటెయ్యని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:24 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో చిత్రవిచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్‌.. ఎట్టి పరిస్థితుల్లోనూ సిటింగ్‌ సీటును కోల్పోకూడదని బీఆర్‌ఎస్‌ పార్టీలు హోరాహోరీగా...

Jubilee Hills Bypoll: ఓటెయ్యని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే

  • పార్టీల బూత్‌ కమిటీ సభ్యుల డిమాండ్‌

  • బస్తీలు, కాలనీల్లో ఓటర్‌ లిస్టు ఆధారంగా ఓటెయ్యని వారిని గుర్తిస్తున్న నేతలు

  • ఓ ఇంట్లో 18 ఓట్లుంటే పోలైంది నాలుగే

  • మిగిలిన 14 మందీ డబ్బులిచ్చేయాలని హుకుం

  • ఓటెయ్యని వారి నుంచి డబ్బు వసూలు చేసి.. కాలనీల్లో పనులకు వాడాలనే యోచన

  • అపార్ట్‌మెంట్లలో సగం మందీ ఓటెయ్యని వైనం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో చిత్రవిచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్‌.. ఎట్టి పరిస్థితుల్లోనూ సిటింగ్‌ సీటును కోల్పోకూడదని బీఆర్‌ఎస్‌ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాయి. ఇదంతా సాధారణంగా జరిగేదే కదా.. అనుకుంటున్నారా? ఇక్కడే మొదలైంది అసలు కథ..! ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. డబ్బు తీసుకొని ఓటెయ్యని వారిని.. ఆయా పార్టీల నేతలు డబ్బు వెనక్కి ఇచ్చెయ్యమని డిమాండ్‌ చేస్తున్నారు. బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో డబ్బులిచ్చినవారే నిలదీస్తున్నారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత తమ ఏజెంట్ల వద్ద ఉన్న ఓటర్‌ లిస్టు ఆధారంగా డబ్బులు తీసుకొని ఓటెయ్యని వారిని గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని పలు డివిజన్లలో తిరిగిన బూత్‌ కమిటీ సభ్యులు.. బస్తీల ముఖ్యులు, కాలనీ పెద్దలను సంప్రదించారు. ‘ఆ డబ్బులు మీరైనా తీసుకొని కాలనీ, బస్తీల అవసరాలకు వినియోగించుకోండి’ అని సూచించారు. మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ వాసులు సమావేశమై.. ఓటేయని వారు డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అపార్ట్‌మెంట్‌ నిర్వహణకు వినియోగించుకోవాలని నిర్ణయించారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారింది. ప్రధాన పార్టీలు పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేశాయి. గతంలో పోలింగ్‌ ఎక్కువగా నమోదైన బూత్‌లను పరిగణనలోకి తీసుకొని డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో 50 శాతానికి మించే నగదు పంపిణీ చేశారు. ఆయా బూత్‌ కమిటీల సభ్యులు కూడా తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు, ఆ తర్వాత బంధువులకు, స్నేహితులకు, తమకు తెలిసిన కుటుంబాలకు ఇచ్చారు. ఇలా అన్ని ప్రాంతాల్లో డబ్బు పంచారు. ఇక అపార్ట్‌మెంట్లు, బస్తీల్లో మాత్రం ఆయా ప్రాంతాల ముఖ్యుల ద్వారా పంపిణీ చేశారు. ఓ ప్రధాన పార్టీ ఉన్నతస్థాయి ఆదేశాలకు అనుగుణంగా బూత్‌ కమిటీల ద్వారా డబ్బు పంపిణీ చేయగా.. మరో పార్టీ బూత్‌ కమిటీ సభ్యులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకుండా మిగుల్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


డబ్బులు తీసుకొనీ..

ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్‌ కమిటీ సభ్యులు ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌, యూసు్‌ఫగూడ తదితర డివిజన్లలోని పలు బూత్‌ల్లో డబ్బులు తీసుకొని ఓటెయ్యని వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. పోలింగ్‌ సమయంలో అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా కూర్చున్న వ్యక్తి ఓటేసేందుకు వచ్చిన వారిని గుర్తించి, ఓటరు లిస్టులో పేరును రౌండ్‌ చేసుకుంటారు. ఇలా ఏజెంట్‌ వద్ద ఉన్న ఓటేసిన వారి జాబితా; ఓటరు లిస్టు; బూత్‌ కమిటీ వద్ద డబ్బులు పంపిణీ చేసిన ఓటరు జాబితాలను సరిచూసుకోగా చాలా మంది ఓటర్లు డబ్బులు తీసుకొని ఓటెయ్యలేదని గుర్తించారు. ఎస్పీఆర్‌ హిల్స్‌లో ఓ ఇంట్లో 18 ఓట్లకు దాదాపు రూ.45 వేల వరకు తీసుకోగా.. అందులో కేవలం నాలుగు ఓట్లే పోలైనట్లు గుర్తించారు. మిగతా 14 మంది ఓట్లు వేయకపోవడంపై బూత్‌ కమిటీ సభ్యులు ఆరా తీశారు. ఆ ప్రాంత ముఖ్యుడికి సమాచారమిచ్చారు. బుధవారం ఉదయం ఆ ఇంటికెళ్లి డబ్బులివ్వాల్సిందేనని బస్తీ ముఖ్యులు సూచించారు. ఇలా పలు కాలనీలు, బస్తీల్లో పోలైన ఓట్లపై ఆరా తీశారు. ఓటెయ్యని వారి నుంచి డబ్బులు వసూలు చేసి, బస్తీలో పనులకు వినియోగించుకోవాలని బూత్‌ కమిటీ ఇన్‌చార్జిలు సూచించినట్లు తెలిసింది.

ఆ డబ్బు అపార్ట్‌మెంట్ల నిర్వహణకు..

అపార్ట్‌మెంట్ల వారీగా కూడా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. కానీ, పలు అపార్ట్‌మెంట్లలో డబ్బులు తీసుకొని సగం మంది కూడా ఓట్లేయలేదని గుర్తించారు. ఓ పార్టీ బూత్‌ కమిటీ నుంచి డబ్బులు తీసుకొని ఓటెయ్యని జాబితాను అపార్ట్‌మెంట్‌ ముఖ్యులకు అందించారు. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులంతా ఉదయం సమావేశమై, ఓటెయ్యని వారు డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అపార్ట్‌మెంట్‌ నిర్వహణకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు బూత్‌ కమిటీ సభ్యులు కూడా అంగీకరించారు.

Updated Date - Nov 13 , 2025 | 06:46 AM