Uttam: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్ఠాత్మకం
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:24 AM
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమని, పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని కరీంనగర్ జిల్లా నేతలకు ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.

క్యాడర్, లీడర్ అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్ జిల్లా నేతలతో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమని, పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని కరీంనగర్ జిల్లా నేతలకు ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నికల్లో గెలిచి.. అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకూ సమాయత్తం కావాలన్నారు. స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ, సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నాయకులను ఈ ఎన్నికల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు.
తద్వారా రేపటి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం సులభతరమవుతుందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రతి ఓటూ కీలకమేనని, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాగాన్ని భాగస్వామ్యం చేయగలిగితే గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని అన్నారు.