Uttam: ఆ 8 మందిని కాపాడుతాం
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:57 AM
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకం పనుల్లో అనుకోని ఘటన జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని కాపాడతామన్నారు.

అనుకోని ఘటన జరిగింది..బీఆర్‌ఎస్ హయాంలోనూ లీకేజీలు
వారు కనీసం ఘటనాస్థలానికి వెళ్లలేదు :ఉత్తమ్
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకం పనుల్లో అనుకోని ఘటన జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని కాపాడతామన్నారు. టన్నెల్ కూలిన సమాచారం అందిన వెంటనే సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఉత్తమ్ హుటాహుటిన హెలికాప్టర్‌లో ఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోపల చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. టన్నెల్ తవ్వకంలో రాబిన్ సంస్థ ప్రపంచంలోనే పేరెన్నిక గల సంస్థ అని తెలిపారు. వెంటిలేషన్‌కు ఇబ్బందులు లేవన్నారు. ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌లో ప్రమాదం జరిగినప్పుడు చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన వారిని కూడా సంప్రదింపులు జరిపి... రంగంలోకి దింపుతున్నామన్నారు. అనంతరం శనివారం సాయంత్రం సీఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్‌తోపాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో డీవాటరింగ్, డీసిల్టింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.
సొరంగం పనులు ఇప్పటికే 33.5 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయని, మరో 9.5 కి.మీ పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. కాగా అనుకోకుండా జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో కూడా లీకేజీలు జరిగాయని తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్‌స్టేషన్‌లో ప్రమాదం జరిగి 8మంది చనిపోతే బీఆర్‌ఎస్ వాళ్లు కనీసం అక్కడికి వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డిని అక్కడికి వెళ్లకుండా అరెస్టు చేశారని తెలిపారు. కానీ, ఇప్పుడు సొరంగంలో ఘటన జరిగిన రెండు, మూడు గంటల్లోనే తాము అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టామని, అవాంతరాలన్నింటినీ అధిగమించి ప్రాజెక్టును పూర్తిచేస్తామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్ ప్రకారం ముందుకువెళతామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌లో 14వ కి లోమీటర్ వద్ద సీపేజ్‌ను పూడ్చిచేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని మంత్రి కోమటిరెడ్డ్డి తెలిపారు.