Uttam: నోటీసులకే వణికిపోతే ఎలా?
ABN , Publish Date - May 24 , 2025 | 03:47 AM
జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు ఇస్తేనే వణికిపోతున్నారు.. కమిషన్ నివేదిక ఇచ్చాక ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు తప్పవు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోర తప్పిదాలు జరిగాయని రాజ్యాంగబద్ధంగా పని చేసే అన్ని సంస్థలు తప్పుబట్టాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు
తుమ్మడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు ఎందుకు మార్చారు?
కాళేశ్వరం పేరుతో 82 వేల కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్రంపై మోపారు: ఉత్తమ్
హైదరాబాద్, మే23 (ఆంధ్రజ్యోతి): ‘‘జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు ఇస్తేనే వణికిపోతున్నారు.. కమిషన్ నివేదిక ఇచ్చాక ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు తప్పవు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోర తప్పిదాలు జరిగాయని రాజ్యాంగబద్ధంగా పని చేసే అన్ని సంస్థలు తప్పుబట్టాయి. బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం ప్రజలను నమ్మించేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’’ అని బీఆర్‌ఎస్ నేతలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాల కోసం విచారణ కమిషన్ నోటీసు ఇస్తే.. బీఆర్‌ఎస్ నేతలు కమిషన్‌నే దూషిస్తూ తప్పుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మాటలను వినుంటే జోసెఫ్ గోబెల్స్ కూడా పరేషాన్ అయ్యేవాడన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో తుమ్మడిహట్టి ప్రాజెక్టు పనులను చేపట్టామని, రూ.10వేల కోట్లతో కాలువ పనులు కూడా జరిగాయని చెప్పారు.
ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే 16 నుంచి 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. ఇలాంటి ప్రాజెక్టును కాదని.. కేవలం బీఆర్‌ఎస్ నేతల కమిషన్ల కక్కుర్తితో తుమ్మడిహట్టిని పక్కన పెట్టి.. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం చేపట్టారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో రూ.84 వేల కోట్లకు అంచనాలు పెంచుకుని, ఆ తరువాత దాన్ని రూ.1.20 లక్షల కోట్లకు పెంచారన్నారు. ఇప్పుడు మరమ్మతులు చేయాలంటే రూ.1.50 లక్షల కోట్లు అవుతుందన్నారు. తుమ్మడిహట్టిని కాదని మేడిగడ్డకు ఎందుకు మార్చారో బీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తమ కక్కుర్తి, అసమర్థత, అహంకారంతో తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఓ పెద్దమనిషి ప్రాజెక్టులో బాంబులు పెట్టించారని ఆరోపణలు చేస్తున్నారని.. ఇదే విషయంపై బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే 21 అక్టోబరు 2023లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని గుర్తు చేశారు. అప్పుడే ఎందుకు విచారణ చేయించలేదని ప్రశ్నించారు.. కనీసం ఇప్పుడైనా బాంబుకు సంబంధించిన వివరాలను కమిషన్‌కు ఇవ్వాలని కోరారు.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్‌లోంచి..