Share News

Urea Shortage: పొలం పనులు వదిలి పడిగాపులు

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:14 AM

రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతల కష్టాలు కొనసాగుతున్నాయి. ఎదుగుతున్న పంటలకు అదును దాటక ముందే ఎరువు వేయాల్సి ఉండటంతో యూరియా కోసం రైతులు ..

Urea Shortage: పొలం పనులు వదిలి పడిగాపులు

  • రోజంతా నిల్చుంటే దక్కేది ఒకటీ రెండు బస్తాలే

  • కొన్ని చోట్ల అది కూడా దొరక్క రైతులకు నిరాశ

  • రాష్ట్రంలో కొనసాగుతున్న యూరియా కష్టాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతల కష్టాలు కొనసాగుతున్నాయి. ఎదుగుతున్న పంటలకు అదును దాటక ముందే ఎరువు వేయాల్సి ఉండటంతో యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలం పనులు వదిలి యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జనం కిక్కిరిసిపోతుండటంతో యూరియా దొరుకుతుందో లేదోనని తెల్లవారుజాము నుంచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) ఎదుట రైతులు బారులు తీరుతున్నారు. చెప్పులు, ఆధార్‌ కార్డులను క్యూలో పెట్టి చెట్ల కింద కూర్చుంటున్నారు. అయితే, రోజంతా ఎదురుచూసినా ప్రతి కేంద్రంలో ఒక్కో రైతుకు ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే అందుతున్నాయి. లైన్‌లో ఉన్నా.. కొందరికి అవి కూడా దొరకడం లేదు. దీంతో అన్నదాతలు నిరాశగా వెనుదిరుగుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పీఏసీఎ్‌సలో యూరియా స్టాక్‌ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గోదాం నుంచి యూరియా సరఫరా అయిన తర్వాత కూడా ఫర్టిలైజర్‌ డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా బయట అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సరిపడినంత యూరియా ఇవ్వడం లేదని వనపర్తి జిల్లా ఆత్మకూరులోని సింగిల్‌ విండో కార్యాలయం వద్ద అన్నదాతలు నిరసన తెలిపారు. మెదక్‌ జిల్లా రామాయంపేటలో యూరియా కోసం రైతులు రాస్తారోకో చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతువేదిక వద్ద టోకెన్ల కోసం గంటపాటు అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. యూరియా లారీలు వస్తున్నాయనే సమాచారంతో దుబ్బాక పీఏసీఎస్‌ వద్ద ఆదివారం రాత్రి రైతులు నిద్రించారు. చేర్యాలలో యూరియా కొరతపై అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని. నిడమనూరు, కనగల్‌ మండలాలకు యూరియా లోడు వస్తుందని చెప్పడంతో రైతులు అధిక సంఖ్యలో సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. యూరియా రాలేదని, పక్క సొసైటీకి పంపించారని తెలియడంతో అన్నదాతలు రహదారిపై బైఠాయించారు. రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడలో ఈ-పాస్‌ యంత్రం పనిచేయకపోవడంతో రైతులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు.

బీఆర్‌ఎస్‌ ఆందోళనలు..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు సోమవారం ఆందోళనలు నిర్వహించాయి. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రాథమిక సహకార సంఘం వద్ద ధర్నా చేపట్టారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హరిప్రియా నాయక్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హవేళీఘనపూర్‌లో మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వినాయకుడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మహబూబాబాద్‌లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌.. కలెక్టర్‌ అద్వైత్‌కు వినతిపత్రం అందించారు. మహబూబాబాద్‌ పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ రైతులతో కలిసి ఆందోళన చేశారు. కురవిలో నిర్వహించిన ధర్నాలో రెడ్యానాయక్‌ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 03:14 AM