Fertilizer Crisis: యూరియా కొరత.. అన్నదాత వెత!
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:56 AM
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రేయింబవళ్లు బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు.
పలు జిల్లాల్లో తప్పని నిరీక్షణలు
రోడ్డెక్కుతున్న రైతులు.. ఆందోళనలు.. కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రేయింబవళ్లు బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. చాలాచోట్ల తోపులాటలు, తొక్కిసలాటలు, గలాటాలు చోటుచేసుకుంటున్నాయి. యూరియా రాక తక్కువగా ఉండటం.. అదే సమయంలో రైతులు భారీ సంఖ్యలో ఎగబడుతుండటంతో చాలాచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క బస్తా కోసం అన్నదాతలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. సరిపడినంత యూరియా లభించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసు బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు.
ఖమ్మం జిల్లా ఆళ్లపల్లి, జూలూరుపాడులో అఖిలపక్ష నాయకులతో కలిసి రైతులు రాస్తారోకోలు నిర్వహించారు. వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక సొసైటీల కార్యాలయాల వద్ద రైతులు పక్కన పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు, కాళీ సంచులు పెట్టుకుని యూరియా కోసం రాత్రి నిద్ర చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలోని శ్రీ దివ్య ఫర్టిలైజర్ షాపునకు మంగళవారం రాత్రి వచ్చిన 111 బస్తాల యూరియా మాయమైంది. రైతులనుంచి ఫిర్యాదులు అందడంతో షాపు లైసెన్స్‌ను 30 రోజల పాటు సస్పెండ్ చేసినట్లు ఏవో తెలిపారు.