Minister Tummala: యూరియా పాపం కేంద్రానిదే
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:46 AM
రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ....
ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దు
రైతులకు మంత్రి తుమ్మల బహిరంగ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. విపక్షాలు చెప్పే మాయమాటలు, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఈ మేరకు రైతులకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రం కేటాయింపులు, సరఫరా, స్వదేశీ యూరియా, దిగుమతి చేసుకున్న యూరియా, ప్రస్తుత పరిస్థితులను ఆ లేఖలో వివరించారు. ‘‘దేశానికి దిగుమతి అయిన యూరియాలో.. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేంద్రం 3.94 లక్షల మెట్రిక్ టన్నుల మేర మన రాష్ట్రానికి కేటాయించింది. అందులో 2.10 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలతో ఎర్రసముద్రంలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దేశీయ యూరియా ఉత్పత్తి కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి 1,69,325 టన్నులను కేటాయిస్తే.. 1,06,852 టన్నుల మేర సరఫరా జరిగింది. ఇది కూడా యూరియా కొరతకు కారణమే’’ అని ఆయన వివరించారు. ఖరీఫ్ సీజన్‌కు 9.80 లక్షల టన్నులు, ఆగస్టు నాటికి 8.30 లక్షల టన్నులను కేటాయించినా.. ఇప్పటికి 5.72 లక్షల టన్నులు రాష్ట్రానికి అందిందని, ఇంకా 2.58 లక్షల టన్నుల యూరియాను సరఫరా చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు వాస్తవాలను గ్రహించి, ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు.
బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలు
యూరియా విషయంలో సోషల్‌మీడియాలో బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని బహిరంగ లేఖలో తుమ్మల మండిపడ్డారు. ‘‘రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. పీఏసీఎస్ కార్యాలయాల వద్ద చెప్పులు క్యూలైన్‌లో పెట్టిస్తున్నారు. మహిళలను క్యూలైన్‌లో నిలబెట్టి, సోషల్ మీడియాలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఈ చర్యలతో శునకానందం పొందుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నానో యూరియా వాడకాన్ని పెంచాలని తుమ్మల కోరారు. ‘‘నానో యూరియాతో భూసారం దెబ్బతినదు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరుగుతుంది. పర్యావరణహితంగా ఉంటుంది’’ అని వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News