Share News

Beer Prices: బీరు ధరలో 70 శాతం ప్రభుత్వానికే!

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:00 AM

బీరు ధరలో దాదాపు 70 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వమే తీసుకుంటోందని యునైటడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ (యూబీ) తెలిపింది. తయారీ, సరఫరా ఖర్చులు పోగా తమకు వచ్చేది 16 శాతం మాత్రమేనని పేర్కొంది.

Beer Prices: బీరు ధరలో 70 శాతం ప్రభుత్వానికే!

  • పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం.. మాకు వచ్చేది 16% మాత్రమే

  • ఐదేళ్లుగా ధరలు పెంచకపోవడంతో భారం: యునైటెడ్‌ బ్రూవరీస్‌

హైదరాబాద్‌, జనవరి 9(ఆంధ్రజ్యోతి): బీరు ధరలో దాదాపు 70 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వమే తీసుకుంటోందని యునైటడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ (యూబీ) తెలిపింది. తయారీ, సరఫరా ఖర్చులు పోగా తమకు వచ్చేది 16 శాతం మాత్రమేనని పేర్కొంది. ప్రస్తుతం అమలులో ఉన్న బీర్ల ధరలను 2019లో నిర్ణయించారని, గత ఐదేళ్లుగా నిర్వహణ వ్యయం పెరిగినా తెలంగాణ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్‌) బీర్ల ధరలు పెంచలేదని తెలిపింది.


ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెరిగిపోవడం, ధరలు పెంచకపోవడంతో తమ బ్రాండ్లు కింగ్‌ఫిషర్‌, హీనెకెన్‌ బీర్ల అమ్మకాలను తెలంగాణలో నిలిపివేయాలని యూబీ సంస్థ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎక్సైజ్‌ కమిషనర్‌కు బుధవారం లేఖ రాసింది. దీనిపై ఆ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. ముడి సరకుల ధరలు, నిర్వహణ వ్యయం పెరగటంతో ధరలు పెంచాలని ఐదేళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని తెలిపింది. రాష్ట్రంలో తమ ఉత్పత్తులను మరింత పెంచాలన్నది తమ లక్ష్యమని, కానీ ఆర్థిక భారంతో అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయించామని తెలిపింది.

Updated Date - Jan 10 , 2025 | 04:00 AM