Share News

‘ఉపాధి’ పనిలో బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:57 AM

ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండ రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

‘ఉపాధి’ పనిలో బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి

  • ఐదుగురికి తీవ్ర గాయాలు.. వారిలో ఒకరి పరిస్థితి విషమం

  • మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న మంత్రి పొన్నం

  • కలెక్టర్‌కు కేంద్రమంత్రి సంజయ్‌ ఫోన్‌..

అక్కన్నపేట, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండ రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో సంజీవరాయుని గుట్ట దగ్గర పలువురు కూలీలు పనులు చేస్తుండగా వారిపై బండరాళ్లతో పాటు మట్టి దిబ్బలు కూలాయి. గమనించిన చుట్టుపక్కల రైతులు, కూలీలు వారిని బండ రాళ్లు, మట్టి తొలగించారు. కందారపు సారవ్వ (50), ఆమె కూతురు అన్నాజీ మమత (32) అక్కడికక్కడే మృతి చెందారు. ఇంద్రాల స్వరూప పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలవడంతో హుస్నాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలు సారవ్వకు భర్త, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. కుమార్తె మమతకు భర్తతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.


ఘటనా స్థలాన్ని హుస్నాబాద్‌ ఏసీపీ సతీశ్‌, సీఐ శ్రీనివాస్‌ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌ భాస్కర్‌ తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇటు కేంద్రమంత్రి బండి సంజయ్‌ జిల్లా కలెక్టర్‌ మను చౌదరితో ఫోన్‌లో మాట్లాడి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ మను చౌదరి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. కాగా, కూలీలు మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు జీవిత బీమా వర్తించేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

Updated Date - Jan 31 , 2025 | 04:57 AM