Konark Express: కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:25 AM
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు ప్రయాణికులను తోటి ప్రయాణికుడు మోసం చేశాడు. దాంతో బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీలో మత్తు మందు కలిపి ఇద్దరు ప్రయాణికుల డబ్బు, నగలు దోచుకున్న తోటి ప్రయాణికుడు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు ప్రయాణికులను తోటి ప్రయాణికుడు మోసం చేశాడు. దాంతో బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌కు చెందిన సత్యవతి అనే మహిళ కుమారుడు శశికుమార్‌తో కలిసి ఓ శుభకార్యం కోసం వారం రోజుల క్రితం రాజమండ్రికి వెళ్లారు. ఈనెల 15వ తేదీ రాత్రి వారు సికింద్రాబాద్‌కు వచ్చేందుకు రాజమండ్రిలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలోఎక్కారు. రైలు ఫ్లాట్‌ఫాంపై ఉండగానే చాయ్(టీ) అమ్ముకుంటూ ఓ వ్యక్తి వచ్చాడు.
అప్పుడు 45 ఏళ్ల వయసున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి సత్యవతి వాళ్ల ఎదురుగా కూర్చుని, టీ తాగాలని సత్యవతి, శశికుమార్‌కు ఇచ్చాడు. దాంతో ఆ వ్యక్తితో కలిసి వారు టీ తాగారు. ఆ తర్వాత సత్యవతి, శశికుమార్ స్పృహ కోల్పోయారు. 16వ తేదీ ఉదయం రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోకముందే వారిద్దరూ స్పృహలోకి వచ్చారు. బ్యాగులు చూసుకోగా తమ బ్యాగులో ఉండాల్సిన 25 గ్రాముల బంగారు గొలుసు, రూ 6 వేలు నగదు కనిపించలేదు. మోసపోయామని గ్రహించిన సత్యవతి, శశికుమార్ సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో జరిగింది కాబట్టి ఈ కేసును రాజమండ్రి జీఆర్‌ిపీ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.