CMRE College: సీఎంఆర్ బాలికల హాస్టల్ ఘటనలో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:22 AM
సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో వీడియోలు తీసిన ఘటనలో ఇద్దరు యువకులను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం వారిని రిమాండ్‌కు తరలించారు.

హాస్టల్‌లోని వంట మనుషులే నిందితులు
నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల చైర్మన్, డైరెక్టర్, ప్రిన్సిపాల్, ఇద్దరు వార్డెన్లపైనా కేసు
మేడ్చల్ టౌన్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో వీడియోలు తీసిన ఘటనలో ఇద్దరు యువకులను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం వారిని రిమాండ్‌కు తరలించారు. అలాగే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించిన కళాశాల చైర్మన్, డైరెక్టర్, ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరు వార్డెన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి తమను వీడియోలు తీసే ప్రయత్నం చేశారంటూ గత బుధవారం రాత్రి విద్యార్థినులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు అక్కడ వంట మనుషులుగా పని చేస్తున్న నందకిషోర్ కుమార్ (20), గోవింద్ కుమార్ (20)ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టగా.. వారిద్దరూ నేరాన్ని అంగీకరించారు. గతంలోనూ విద్యార్థినుల పట్ల నిందితులు అసభ్యంగా ప్రవర్తించేవారని డీసీపీ తెలిపారు.
నిందితుల విశ్రాంతిగది.. హాస్టల్ బాత్రూమ్‌కు సమీపంలో ఉండడంతో వెంటిలేటర్ ద్వారా విద్యార్థినులను చూసేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాత్రూమ్‌లో ఎవరో తొంగి చూస్తున్నారని, వీడియోలు తీస్తున్నట్టు అనుమానం ఉంద ని వార్డెన్లకు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా, నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని పేర్కొన్నా రు. ఈ వ్యవహారం బయటికి పొక్కకుండాకళాశాల యా జమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేసిందని చెప్పారు. బాలిక వసతి గృహాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించలేదని, భద్రత నియమాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. హాస్టల్‌లో పని చేసే యువకులను అక్కడే ఉండటానికి అనుమతివ్వడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ మేరకు కళాశాల చైర్మన్ చామకూ ర గోపాల్ రెడ్డి, డైరెక్టర్ జగ్గారెడ్డితో పాటు వార్డెన్లు ప్రీతిరెడ్డి, కేవీ.ధనలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ అనంత నారాయణ పైనా కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థినుల భద్రత విషయంలో కళాశాల యాజమాన్యాలు, హాస్టళ్ల నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కళాశాలలు, హాస్టళ్లలో ఎవరైనా వేధిస్తే విద్యార్థినులు నేరుగా పోలీసులను సంప్రదించాలని కోరారు.