Share News

Tummla: బ్యాంకర్లు తీరు మార్చుకోవాలి

ABN , Publish Date - Mar 01 , 2025 | 03:49 AM

రైతులకు వ్యవసాయ రుణాలను ఇచ్చే విషయంలో బ్యాంకర్లు తీరు మార్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించుకుంటున్న స్థాయిలో బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం వ్యవసాయ రంగానికి మంచిదికాదని పేర్కొన్నారు.

Tummla: బ్యాంకర్లు తీరు మార్చుకోవాలి

  • ఆశించినమేరకు పంట రుణాలివ్వడంలేదు

  • అధిక మొత్తంలో రుణాలిచ్చి రైతులను ప్రోత్సహించాలి: తుమ్మల

హైదరాబాద్‌/కవాడిగూడ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయ రుణాలను ఇచ్చే విషయంలో బ్యాంకర్లు తీరు మార్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించుకుంటున్న స్థాయిలో బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం వ్యవసాయ రంగానికి మంచిదికాదని పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.90,795 కోట్ల వ్యవసాయ రుణాలను లక్ష్యంగా పెట్టుకోగా.. 2024 డిసెంబరు వరకు రూ.58,791 కోట్లను మాత్రమే బ్యాంకులు రైతులకు అందించాయని చెప్పారు. రుణాల అందజేత విషయంలో బ్యాంకుల వారీ, శాఖల వారీగా పనితీరును సమీక్షించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, మిర్చి, పసుపు, మొక్కజొన్న, అపరాలు, పండ్లకు సంబంధించి ప్రాథమిక ప్రాసెసింగ్‌ యూనిట్లకు రుణాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు.


తెలంగాణ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

హస్తకళాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. తెలంగాణ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. శుక్రవారం నగరంలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన గోల్కొండ క్రాప్స్ట్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరానికి గాను తెలంగాణ హస్తకళల్లో అత్యున్నత నైపుణ్యాన్ని ప్రదర్శించిన 11 మంది కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. మొదటి బహుమతి కింద రుకియాబాయికి రూ.51వేలతో పాటు మెమెంటో అందించి సత్కరించారు.

Updated Date - Mar 01 , 2025 | 03:49 AM