Tummla : యూరియా కొరత తీర్చండి
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:38 AM
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారని, నెలవారీ కేటాయింపుల ప్రకా రం రాష్ట్రానికి సరఫరా చేయాలని కేంద్రా న్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
నెలవారీ కేటాయింపుల మేరకు ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ
హైదరాబాద్, జులై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా కొరతతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారని, నెలవారీ కేటాయింపుల ప్రకా రం రాష్ట్రానికి సరఫరా చేయాలని కేంద్రా న్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసిన తుమ్మల... తాజాగా బుధవారం మరోసారి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్‌కు లేఖలు రాశారు. వానాకాలం సీజన్ ప్రారంభమై ఇప్పటికే నెల రోజులు పూర్తయిందని, యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి రాష్ట్రానికి 5 లక్షల టన్నుల యూరియా కేటాయించినా... కేవలం 3 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రానికి వచ్చిందని గుర్తు చేశారు.
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో యూరియా వినియోగం అత్యధికంగా ఉంటుందని ఈ తరుణంలో.. కిషన్‌రెడ్డి, సంజయ్ చొరవ తీసుకొని రాష్ట్రానికి యూరియా కోటాను తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. జూలై నెలలో కేటాయించిన 97 వేల టన్నుల యూరియాను ఓడరేవుల నుంచి రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు. అదేక్రమంలో రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి యూరియా కేటాయింపులను 30,800 టన్నుల నుంచి 60 వేల టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు నెలల్లో వచ్చిన లోటును భర్తీ చేయటానికి అదనపు కేటాయింపులు చేయాలని కోరారు. కాగా, చేనేత కార్మికులకు లక్ష వరకు రుణమాఫీ చేయటానికి రూ.33 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. దీంతో 5,691 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.