మార్చి 31లోగా రైతు భరోసా జమ: తుమ్మల
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:56 AM
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం తమదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్చి 31లోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు.

హైదరాబాద్, ఎల్‌బీనగర్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం తమదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్చి 31లోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 35ు అంటే రూ.72 వేల కోట్ల నిధులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించామన్నారు. భూమికి, విత్తనానికి ఉన్న సంబంధం కాంగ్రెస్ పార్టీకి, రైతులకు ఉందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఏడాదిలోనే రైతు సంక్షేమానికి రూ.54,280 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. సహకార విద్యుత్తు సరఫరా సంఘం లిమిటెడ్(సెస్) నిధుల వసూళ్లు, వినియోగంపై అధికారులతో మంత్రి తుమ్మల సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు విద్యుత్తు సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయిల్ ఫాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫాం సాగులో దేశంలో తెలంగాణను తొలి స్థానంలో నిలపాలని ఆదేశించారు.
అత్యాధునిక సౌకర్యాలతో కోహెడ మార్కెట్‌ను నిర్మిస్తాం
కోహెడ మార్కెట్‌ను అత్యాధునిక సౌకర్యాలతో మూడు వేల కోట్లు వెచ్చించి నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సంఘం సెంట్రల్ ఫోరం ఆధర్యంలో రూపొందించిన 2025 నూతన డైరీ, క్యాలెండర్‌ను మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ మార్కెట్‌లో ఆయన ఆవిష్కరించారు.