Share News

Farmer Welfare: రైతు సంక్షేమానికి సర్కారు పెద్ద పీట

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:35 AM

రైతుల సంక్షేమానికి రేవంత్‌ సర్కారు పెద్ద పీట వేస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు.

Farmer Welfare: రైతు సంక్షేమానికి సర్కారు పెద్ద పీట

  • రూ.1.05లక్షల కోట్లు ఖాతాల్లో వేసిన ఘనత సీఎందే

  • బీఆర్‌ఎస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు:తుమ్మల, సీతక్క

ములుగు/వాజేడు/మంగపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి రేవంత్‌ సర్కారు పెద్ద పీట వేస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని సంక్షేమ పథకాలనూ రేవంత్‌రెడ్డి మాత్రమే సమర్థంగా అమలు చేస్తున్నారని చెప్పారు. రూ.1.05లక్షల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత సీఎం రేవంత్‌దేనని కొనియాడారు. సోమవారం ములుగు జిల్లాలో ఇరువురు మంత్రులు పర్యటించారు. ఒప్పంద వ్యవసాయంలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు పరిహారం చెక్కులను వాజేడులో పంపిణీ చేశారు. వాజేడు, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాలకు చెందిన 671 మంది రైతులకు రూ.3.80కోట్ల విలువైన చెక్కులను అందజేశారు.


ఈ సందర్భంగా తుమ్మల, సీతక్క మాట్లాడారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే బీఆర్‌ఎస్‌, విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు చెక్కుల పంపిణీకి అడ్డు తగలొద్దని చెప్పినా బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు చేయటం సిగ్గుచేటన్నారు. ఆపరేషన్‌ కగార్‌కు నిలయంగా మారిన కర్రెగుట్టలను టూరిజం హబ్‌గా మారుస్తామని హామీనిచ్చారు. కాగా, మంగపేటలో మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవనికి మంత్రి సీతక్క వస్తుండగా కమలాపురంలోని ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

Updated Date - Jul 08 , 2025 | 03:35 AM