Share News

TTD: రేడియో కాలర్‌తో.. జంతువుల నుంచి భక్తులకు రక్షణ

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:28 AM

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించే దిశగా టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. కాలినడక మార్గాలు, ఘాట్‌రోడ్లలో ప్రయాణించే వాహనదారులకు చిరుతలు, ఏనుగులు, ఎలుగబంట్ల నుంచి ఇబ్బంది కలగకుండా యానిమల్‌ రేడియో కాలర్‌ సిస్టంను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

TTD: రేడియో కాలర్‌తో.. జంతువుల నుంచి భక్తులకు రక్షణ

  • యానిమల్‌ రేడియో కాలర్‌ సిస్టంపై టీటీడీ దృష్టి

  • వైల్డ్‌లైఫ్‌ అనుమతి కోరిన అధికారులు

తిరుమల, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించే దిశగా టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. కాలినడక మార్గాలు, ఘాట్‌రోడ్లలో ప్రయాణించే వాహనదారులకు చిరుతలు, ఏనుగులు, ఎలుగబంట్ల నుంచి ఇబ్బంది కలగకుండా యానిమల్‌ రేడియో కాలర్‌ సిస్టంను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికోసం వైల్డ్‌లైఫ్‌ అధికారుల అనుమతి కోరింది. 2023 ఆగస్టు 12న అలిపిరి కాలిబాటలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడిచేసి చంపిన ఘటన సంచలనం రేపింది. అదే ఏడాది జూన్‌ 22న ఆదోనికి చెందిన కౌశిక్‌ అనే నాలుగేళ్ల బాలుడిపైనా చిరుత దాడి చేసింది. ఆ బాలుడు అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. పదిహేనేళ్లుగా అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాటలతో పాటు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండో ఘాట్‌, తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్‌ రోడ్డులో చిరుతలు కనిపిస్తూనే ఉన్నాయి. పైగా, మొదటి ఘాట్‌లోని ఏడో మైలు వద్ద, పార్వేటమండపం, శ్రీవారిపాదాల మార్గంలో ఏనుగుల గుంపు కూడా సంచరిస్తున్న క్రమంలో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వన్యమృగాల భయం మాత్రం వెంటాడుతూనే ఉంది.


ట్రాకింగ్‌తో అప్రమత్తమయ్యేలా...

అడవి జంతువుల నుంచి భక్తులకు ఎలాంటి రక్షణ కల్పించాలనే అంశంపై ఇప్పటికే టీటీడీ... వైల్డ్‌లైఫ్‌ అఽధికారులను సంప్రదించింది. రేడియో కాలర్‌ సిస్టం అనే ఆలోచనను వైల్డ్‌లైఫ్‌ అఽధికారుల ముందుంచింది. తిరుమల పరిసర ప్రాంతాల్లో సంచరించే చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లతో పాటు జింకలకు ‘రేడియో కాలర్‌ సిస్టం’ను ఏర్పాటు చేయాలని కోరింది. వీటి ద్వారా ఆయా జంతువులు జనసంచారం సమీపానికి వస్తే వెంటనే అలర్ట్‌ కావడానికి వీలుంటుందనే అభిప్రాయాన్ని టీటీడీ ఫారెస్ట్‌ అఽధికారులు వ్యక్తపరిచారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో అనుసరిస్తున్న ఈ విధానాన్ని తిరుమలలోనూ అమలు చేసేందుకు వైల్డ్‌లైఫ్‌ అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.


సిమ్‌తో కూడిన రేడియో కాలర్‌ పరికరం

వైల్డ్‌లైఫ్‌ అధికారుల నుంచి అనుమతి వస్తే తొలుత జంతువులను ట్రాప్‌ చేసి పట్టుకుంటారు. ఆ తర్వాత సిమ్‌తో కూడిన రేడియో కాలర్‌ పరికరాన్ని ఆయా జంతువులకు అమర్చుతారు. తిరుమలలో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాటిలైట్‌ ద్వారా వచ్చే సిగ్నల్స్‌ ఆధారంగా జంతువుల కదలికలను పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి భక్తులకు సమీపానికి వస్తే వెంటనే అప్రమత్తం చేయడంతో పాటు వాటిని అడవిలోకి తరిమేలా చర్యలు తీసుకుంటారు.

Updated Date - Mar 03 , 2025 | 04:28 AM