Share News

Warangal: ఛాతీలో నొప్పి.. కాలువలోకి కారు

ABN , Publish Date - Mar 09 , 2025 | 04:15 AM

వరుస సెలవుల్లో స్వగ్రామంలో ఆనందంగా గడుపుదామని బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. డ్రైవింగ్‌ చేస్తుండగా ఛాతీనొప్పి రావడంతో.. కుటుంబ యజమాని ఆస్పత్రికి వెళ్దామని మలుపుతుండగా..

Warangal: ఛాతీలో నొప్పి.. కాలువలోకి కారు

  • తండ్రి, ఇద్దరు చిన్నారుల మృతి

  • ప్రాణాలతో బయటపడ్డ తల్లి

  • వరంగల్‌ జిల్లాలో ఘోర దుర్ఘటన

  • కారు నడుపుతున్న తండ్రి ప్రవీణ్‌కుమార్‌కు ఛాతీలో నొప్పి

  • ఆస్పత్రికి వెళ్లడానికి యత్నిస్తుండగా ఎస్సారెస్పీ కాలువలో పడ్డ కారు

పర్వతగిరి/నెల్లికుదురు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): వరుస సెలవుల్లో స్వగ్రామంలో ఆనందంగా గడుపుదామని బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. డ్రైవింగ్‌ చేస్తుండగా ఛాతీనొప్పి రావడంతో.. కుటుంబ యజమాని ఆస్పత్రికి వెళ్దామని మలుపుతుండగా.. కారు కాలువలో పడడంతో.. ఆ కుటుంబంలో ముగ్గురిని నీళ్లు మింగేశాయి. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో.. సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్‌కుమార్‌(37) హనుమకొండలో ఎల్‌ఐసీ డెవల్‌పమెంట్‌ అధికారిగా పనిచేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో స్వగ్రామంలో తన తల్లిదండ్రులతో ఆనందంగా గడుపుదామనుకున్నారు. శనివారం ఉదయం తన భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి(4), కుమారుడు ఆర్యవర్ధన్‌(2)తో కలిసి కారు(టీఎ్‌స03-ఎ్‌ఫబీ8881)లో బయలుదేరారు. వారి కారు సంగెం మండలం తీగరాజుపల్లి దాటగానే.. ఛాతీలో నొప్పిగా ఉందంటూ ప్రవీణ్‌ ఆందోళనచెందారు. వైద్యం కోసం వరంగల్‌ వెళ్దామనే ఉద్దేశంతో కారును వెనక్కి తిప్పారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి.. పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకుపోయింది. పరిస్థితిని గమనిస్తూ.. అప్రమత్తమైన కృష్ణవేణి తన ఒడిలో కూర్చున్న కుమారుడిని కారు కిటికీలోంచి బయటకు విసిరి, తాను కూడా కిందకు దూకారు. అప్పటికే కారు కాలువలోకి దూసుకెళ్లింది.


నీటి ఉధృతికి కృష్ణవేణి కొట్టుకుపోగా.. స్థానికులు తాడు సాయంతో కాపాడారు. కుమారుడు ఆర్యవర్ధన్‌ను రక్షించేందుకు యత్నించగా.. అప్పటికే నీళ్లు మింగడంతో.. ఊపిరాడక అతడు చనిపోయాడు. కారుతోపాటు నీటిలో మునిగిపోయిన ప్రవీణ్‌కుమార్‌, చైత్రసాయి కూడా దుర్మరణంపాలయ్యారు. సంఘటనాస్థలిని మామునూరు ఏసీపీ తిరుపతి సందర్శించారు. అంబులెన్స్‌, అగ్నిమాపకశాఖ, ఎక్స్‌కవేటర్లను రప్పించి.. సహాయక చర్యలను చేపట్టారు. నీటి ఉధృతి కారణంగా.. అడుగులో కారు ఎక్కడుందో గుర్తించడం సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వెంటనే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి..అటుగా నీటి ప్రవాహాన్ని తగ్గించేలా గేట్లు మూయించారు. నీటి ప్రవాహం తగ్గాక.. ప్రమాదస్థలి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో కారును గుర్తించారు. అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బంది ఐదు గంటల పాటు శ్రమించి, పొక్లెయినర్‌, క్రేన్‌ సాయంతో కారును, అందులోని ప్రవీణ్‌, చైత్రసాయి మృతదేహాలను వెలికి తీశారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఐదుగంటల పాటు.. ప్రవీణ్‌, చైత్ర మృతదేహాలు లభ్యమయ్యేవరకు అంబులెన్స్‌లో ఉన్న కృష్ణవేణి తన ఒళ్లో ఆర్యవర్ధన్‌ మృతదేహాన్ని పెట్టుకుని, ‘‘కన్నా.. లే..’’అంటూ రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఓ వైపు ఆర్యవర్ధన్‌లో కదలికలు లేకపోవడం.. తన భర్త, కూతురి జాడ కనిపించకపోవడంతో.. ఆమె రోదన మిన్నంటింది.


నాలుగేళ్ల క్రితం నలుగురి మృతి

నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగి, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా మృతులు కారులో ప్రయాణిస్తుండడం గమనార్హం..! ఈప్రాంతంలో స్పీడ్‌ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 09 , 2025 | 04:15 AM