Share News

దుబాయ్‌లో తెలుగు సినీ నిర్మాత మృతి

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:21 AM

టాలీవుడ్‌ యువ నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి మంగళవారం దుబాయ్‌లో ఆకస్మికంగా మృతి చెందారు. ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.

దుబాయ్‌లో తెలుగు సినీ నిర్మాత మృతి

  • తన ఫ్లాట్‌లో నిద్రలోనే కన్నుమూసిన కేదార్‌

  • ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం విషాదం

  • ఫ్లాట్‌లో కేదార్‌తో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే

  • గతేడాది ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో కేదార్‌ అరెస్టు

  • ఇటీవలే గం గం గణేశ సినిమా నిర్మాణం

  • దుబాయిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు

  • అల్లు అర్జున్‌, విజయ దేవరకొండల సన్నిహితుడు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): టాలీవుడ్‌ యువ నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి మంగళవారం దుబాయ్‌లో ఆకస్మికంగా మృతి చెందారు. ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. ఆనంద్‌ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన గం గం గణేషా చిత్రం ఆయన నిర్మించిందే. టాలీవుడ్‌ సినీ ఫైనాన్షియర్‌ కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు పరిశ్రమలోని ముఖ్యులు అనేకులు హాజరైన తరుణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ వేడుక అనంతరం దుబైలో సోమవారం రాత్రి మిత్రులతో పార్టీకి హాజరైన కేదార్‌ అనంతరం తన ఫ్లాట్‌లో నిద్రపోయాడు. నిద్రలోనే మృతి చెందాడని సమాచారం. మరణానికి అనారోగ్యమా? మరింకేమైనా కారణం ఉందా? తేలాల్సి ఉంది. కేదార్‌ నిద్రించిన ఫ్లాట్‌లోనే తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా బస చేసినట్లు సమాచారం. ఆ మాజీ ఎమ్మెల్యేను దుబాయి పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు ధ్రువీకరించని సమాచారం. మాజీ ఎమ్మెల్యే నాలుగు నెలలుగా దుబాయిలోనే దుబాయి, అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటున్నారని అంటున్నారు. దుబాయిలో అత్యంత ఖరీదైన జుమేరియా ప్రాంతంలో కేదార్‌తోనే మాజీ ఎమ్మెల్యే ఉంటున్నాడని సమాచారం.


కేదార్‌ పలువురు సినీ రాజకీయ ప్రముఖుల తరఫున దుబాయిలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు చెబుతున్నారు. కేదార్‌ ప్రత్యేకంగా ప్రైవేటు విమానాన్ని కూడా వినియోగిస్తారు. సరిగ్గా ఏడాది క్రితం గచ్చిబౌలి పరిఽధిలోని రాడిసన్‌ హోటల్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు ఇచ్చిన కొకైన్‌ పార్టీకి కేదార్‌తో పాటు.. కొందరు సినీ ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందిన జూనియర్‌ మహిళా ఆర్టిస్టులు సైతం హాజరయ్యారని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. కేదార్‌ను ఆ కేసులో ఏ4 నిందితుడిగా చేర్చారు. ఆ రోజు పార్టీ ఇచ్చిన వివేకానంద, వారికి డ్రగ్స్‌ సరఫరా చేసిన స్మగ్లర్‌ సయ్యద్‌ అబ్బాస్‌ ఆలీ, నిర్భయ్‌, కేదార్‌లతో పాటు మరో ఆరుగురిని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కేదార్‌ను ముందుగా డ్రగ్స్‌ సరఫరాదారుడిగా అనుకున్న పోలీసులు తర్వాత వినియోగదారుడిగా తేల్చారు. నోటీసులు ఇచ్చి విచారించివదిలేశారు. గతేడాది ఫిబ్రవరి 26న డ్రగ్స్‌ కేసులో కేదార్‌ పేరు వెలుగులోకి రాగా సరిగ్గా ఏడాది తర్వాత ఫిబ్రవరి 25న కేదార్‌ దుబాయ్‌లో మృతి చెందారు. కేదార్‌కు సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండలతో పాటు ఇతర సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేదార్‌ సినీ నిర్మాతగా మారక ముందు నుంచి నగరంలోని ఒక పబ్‌లో భాగస్వామిగా ఉన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Updated Date - Feb 26 , 2025 | 04:21 AM