Ponguleti: త్వరలో 6 వేల మంది సర్వేయర్లతో భూముల మ్యాపింగ్
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:46 AM
రాష్ట్రంలో భూముల మ్యాపింగ్ చేపడతామని, ఇందుకు త్వరలో మొదటి విడతగా 6వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితెలిపారు.
గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం
దేశానికి రోల్‌మోడల్‌గా భూభారతి అమలు
ఆగస్టు 15 నాటికి భూ సమస్యల పరిష్కారం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, పరిగి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల మ్యాపింగ్ చేపడతామని, ఇందుకు త్వరలో మొదటి విడతగా 6వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితెలిపారు. గురువారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్‌లో రెవెన్యూ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులను తిరిగి నియమిస్తామని చెప్పారు. భూభారతి చట్టాన్ని దేశానికి రోల్‌మోడల్‌గా అమలు చేస్తామన్నారు. ధరణి వల్ల తమకు అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ తన వద్దకు వచ్చి చెప్పారని, భూ భారతి చట్టంతో వారు కూడా సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ధరణితో వేలాది ఎకరాలను కొల్లగొట్టి పేదలు అడిగితే కోర్టుకు వెళ్లమన్నారని, కానీ తాము అసైన్డ్ భూములకు కూడా హక్కులు కల్పిస్తామని తెలిపారు. కోర్టు పరిధిలో లేని ప్రతి భూసమస్య పరిష్కరించడమే లక్ష్యంగా భూ భారతిని తీసుకువస్తున్నామన్నారు. పైలట్ గ్రామాల్లో స్వీకరించిన సమస్యలు మే నెలాఖరు వరకు పరిష్కరిస్తామని, జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులతో సమస్యల పరిష్కారం చేస్తామని తెలిపారు.
మంచిని కూడా చెడుగా ప్రతిపక్షం ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో రెండంకెల సీట్లు కూడా రావని మంత్రి జోష్యం చెప్పారు. కాగా భూ భారతి-2025 చట్టం ద్వారా భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని మంత్రి పొంగులేటి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో ఈ చట్టంపై అవగాహన సదస్సులో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పొంగులేటి మాట్లాడుతూ కేసీఆర్ తెచ్చిన ధరణి-2020 చట్టం భూములున్న ఆసాముల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిందన్నారు. పార్ట్-బీలో 18 లక్షల ఎకరాల భూములను చేర్చి వాటి యజమానాలను నానాహింసలు పెట్టారన్నారు. భూ భారతి చట్టంలో సాదాబైనామా దరఖాస్తులపై విచారణ జరిపించి, వాస్తవంగా ఉంటే సత్వరమే పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం పైలట్‌గా తీసుకున్న 4 జిల్లాల్లోని 4 మండలాల్లోనేకాకుండా మే మొదటి వారంలో మిగతా 28 జిల్లాలో ఒక్కో మండలాన్ని మోడల్‌గా తీసుకుని భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆగస్టు 15 నాటికి భూములున్న రైతులు, ఆసాముల సమస్యలు వంద శాతం పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలుతో 70 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. మండలి చీఫ్‌విప్ పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూభారతి చట్టం దేశంలోని రెవెన్యూ శాఖకే ఆదర్శం కానుందని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
Faheem Fake Letter Controversy: సీఎంకు చెడ్డ పేరు వచ్చేలా చేయను.. చేయబోను