Share News

Caste Survey: నేటి నుంచి మరోసారి కుల గణన!

ABN , Publish Date - Feb 16 , 2025 | 03:34 AM

సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే ఈ నెల 16 నుంచి మరోసారి ప్రారంభం కానుంది. గతంలో నిర్వహించిన సర్వే సందర్భంగా వివరాలు ఇవ్వనివారు, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లినవారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

Caste Survey: నేటి  నుంచి  మరోసారి కుల గణన!

మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల కోసం.. ఈ నెల 28 వరకు వివరాలు ఇవ్వొచ్చు

  • ఫోన్‌ చేస్తే ఇంటికొచ్చి వివరాలు సేకరిస్తారు

  • ప్రజాపాలన కేంద్రాలకు వెళ్లి ఫారం నింపొచ్చు

  • ఇంటిదగ్గరే నింపి ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వొచ్చు

  • వెబ్‌సైట్లో సర్వే ఫాం డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు

  • వంద శాతం కులగణన లక్ష్యంగా ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే ఈ నెల 16 నుంచి మరోసారి ప్రారంభం కానుంది. గతంలో నిర్వహించిన సర్వే సందర్భంగా వివరాలు ఇవ్వనివారు, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లినవారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇలా రెండోసారి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని 100 శాతం జనాభాను కవర్‌ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల వివరాలను రెండోసారి సర్వేలో సేకరిస్తారు. రాష్ట్రంలో ఏ కులంవారు ఎంత మంది ఉన్నారు? వారి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ కుల గణనను చేపట్టింది. 2024 నవంబరు 6న ప్రారంభించి డిసెంబరు 25 వరకు 50 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఫిబ్రవరి 4న నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కుల గణన వివరాలపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో గుర్తించిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కుటుంబాల(96.9ు)ను సర్వే చేయడం జరిగిందని వెల్లడించారు. ఇంకా 3.1 శాతం(3,56,323) కుటుంబాలను సర్వే చేయలేదని చెప్పారు.


మిగిలిపోయిన వారి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. అసంపూర్తి సర్వే గణాంకాలు న్యాయస్థానాల ముందు నిలబడవని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కవర్‌ అయ్యేలా సర్వే ఉండాలని అభిప్రాయం వ్యక్తమైంది. కేసీఆర్‌, కేటీఆర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వంటి బీఆర్‌ఎస్‌ నాయకులు సర్వేలో పాల్గొనలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభా వేదికగా ఆరోపించారు. అలాంటివారు రెండోసారి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అందుబాటులో ఉన్న మంత్రుల సమావేశం జరిగింది. మిగిలిపోయిన వారి కుల గణనకు తేదీలను నిర్ధారించారు. ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వేను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం నుంచి రెండోసారి సర్వే ప్రారంభం కానుంది. సర్వే సజావుగా సాగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా శనివారం ఆదేశించారు. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వు జారీ చేశారు. సర్వేకు సాధ్యమైనంత ప్రచారం కల్పించాలని చెప్పారు. సర్వేను ప్రభుత్వం మూడు పద్ధతుల్లో చేపట్టనుంది.

  • టోల్‌ ఫ్రీ నెంబర్‌: ప్రభుత్వం ప్రకటించిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ 040-21111111కు ప్రజలు ముందుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా కాల్‌ చేసి, కులగణనలో తమ వివరాలను పొందుపర్చాలని కోరాలి. ఈ నెల 16 నుంచి 28 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఫోన్‌ కాల్‌ చేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారి కాల్‌ చేసిన ఇంటికి వెళ్లి కుల గణన వివరాలు సేకరిస్తారు.

  • ప్రజా పాలనా సేవా కేంద్రాలు: గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లోని వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలనా సేవా కేంద్రాలకు ప్రజలు వెళ్లి తమ వివరాలను అందించాలి. శిక్షణ పొందిన సిబ్బంది ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. సర్వే ఫారాలను నింపడంలో ప్రజలకు వీరు సహకరిస్తారు.

  • ఆన్‌లైన్‌లో: http//seeepcsurvey.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి సర్వే ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో తమ కుటుంబ వివరాలను భర్తీ చేసిన తర్వాత... ఆ ఫారాన్ని దగ్గరలోని ప్రజా పాలనా సేవా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Music Night: యుఫోరియా మ్యూజికల్ నైట్.. ఉర్రూతలూగిస్తున్న తమన్..

Nizamabad: పసుపు మార్కెట్ యార్డు సెక్యూటిరీ అధికారిపై దాడి.. పరిస్థితి ఎలా ఉందంటే..

Updated Date - Feb 16 , 2025 | 03:34 AM