Share News

Bhatti Vikramarka: ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విద్యుత్‌ ప్లాంట్లు

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:19 AM

ఇతర రాష్ట్రాల్లో జల, సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో జల విద్యుత్‌, రాజస్థాన్‌లో సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఆయా రాష్ట్రాలతో కలిసి ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు.

Bhatti Vikramarka: ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విద్యుత్‌ ప్లాంట్లు

  • హిమాచల్‌ప్రదేశ్‌లో జల, రాజస్థాన్‌లో సోలార్‌ ప్లాంట్లు..

  • ఆయా రాష్ట్రాలతో కలిసి సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటు యోచన

  • కరెంట్‌ చార్జీలు పెంచ బోం: భట్టివిక్రమార్క

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్ర జ్యోతి): ఇతర రాష్ట్రాల్లో జల, సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో జల విద్యుత్‌, రాజస్థాన్‌లో సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఆయా రాష్ట్రాలతో కలిసి ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్లీన్‌, గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించేందుకు నూతన ఇంధన విధానాన్ని త్వరలో తేనున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గంలో దీనిపై చర్చించిన తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ, ఫార్మాసిటీ, మెట్రో రైలు విస్తరణతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరగనున్నందున దీనికి అనుగుణంగా హరిత ఇంధన రంగంలోకి రావాలని సీఐఐ, ఫిక్కీ, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌టీపీసీ తదితర వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు.


శుక్రవారం హైదరాబాద్‌లో నూతన ఇంధన విధానం ముసాయిదాపై ప్రభావవర్గాలతో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 15,623 మెగావాట్లు ఉండగా... 2029-30 నాటికి 24వేల మెగావాట్లకు, 2035నాటికి 31,809 మెగావాట్లకు చేరనుందని, ఈ డిమాండ్‌ను తీర్చేందుకు వీలుగా స్వచ్ఛమైన, స్థిర మైన, సరసమైన ఇంధనానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రీన్‌ ఎనర్జీని అదనంగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రిజర్వాయర్లలో ఫ్లోటింగ్‌ సోలార్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, పంప్డ్‌ స్టోరేజీ, పవన విద్యుత్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు.


ఇప్పటికే స్వయం సహాయక సంఘాలతో 1,000 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు పెట్టించాలని నిర్ణయించామని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో రివర్సబుల్‌ పంపింగ్‌ విధానం ఉందని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ , ఏఐ సిటీ, ఫార్మాసిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, విమానాశ్రయం పారిశ్రామిక కారిడార్‌తో రాష్ట్రాన్ని లాజిస్టిక్స్‌ పవర్‌ హౌస్‌గా మారుస్తున్నామని తెలిపారు. తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చి.. ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్ముతామని చెప్పారు. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో సా ్టర్ట్‌పలకూ ప్రోత్సాహం ఇస్తామని, రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను పెంచబోమన్నారు. విద్యుత్‌ సంస్థల్లో డైరెక్టర్ల భర్తీకి కసరత్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - Jan 04 , 2025 | 05:19 AM