Share News

Telangana Assembly: నేటి నుంచి అసెంబ్లీ

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:56 AM

రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభమవగానే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి సంతాప ప్రతిపాదన చేస్తారు.

Telangana Assembly: నేటి నుంచి  అసెంబ్లీ

  • వాడీవేడిగా వర్షాకాల సమావేశాలు

  • తొలి రోజు మాగంటి గోపీనాథ్‌కు నివాళి

  • అనంతరం బీఏసీ సమావేశం

  • తర్వాత కమిటీ హాల్లో మంత్రివర్గ భేటీ

  • స్థానికంలో బీసీలకు 42ు రిజర్వేషన్లపై చర్చ

  • జీవో ఇచ్చి ముందుకు వెళ్లే అవకాశం?

  • 40 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ!

  • ‘కాళేశ్వరం’ నివేదికపైనా అసెంబ్లీలో చర్చ!

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభమవగానే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి సంతాప ప్రతిపాదన చేస్తారు. దానిపై సభ్యులు మాట్లాడతారు. అలాగే శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీలు మాగం రంగారెడ్డి, టి.రత్నాకర్‌ల మృతికి సంతాప ప్రతిపాదనపై సభ్యులు మాట్లాడతారు. అనంతరం ఉభయ సభలూ వాయిదా పడనున్నాయి. తర్వాత శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్నదానికి సంబంధించిన అజెండాను ఖరారు చేయనున్నారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఇతర విధానపరమైన అంశాలపైచర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్‌ ఇచ్చిన విచారణ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి పంచాయతీరాజ్‌ చట్టంలో రిజర్వేషన్లపై ఉన్న 50ు పరిమితిని ఎత్తివేస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చిన సర్కారు.. ఆమోదం కోసం గవర్నర్‌ వద్దకు పంపింది. దాన్ని గవర్నర్‌ కేంద్రానికి పంపారు. బీసీలకు ప్రస్తుతం 23 శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచి, స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 69 శాతం మేరకు అమలు చేస్తూ సవరణ బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


అన్ని పార్టీలూ అనుకూలంగానే ఉన్న నేపథ్యంలో శాసనసభలో ఆమోదం లభిస్తుందని, వెంటనే బిల్లు ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలుపై ఏర్పాటైన మంత్రుల కమిటీ.. రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించినప్పుడు చట్ట పరంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే ఇదే మెరుగైన ప్రత్యామ్నాయమని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. మరరరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం వేచి చూడడం, పార్టీల పరంగా 42 శాతం రిజర్వేషన్‌ ప్రకటించి ఎన్నికలకు వెళ్లడం అన్న ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చట్ట సవరణతో జీవో ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్లాలని భావిస్తే.. ఉత్తర్వులు వెలువడిన పది రోజుల్లో పంచాయతీరాజ్‌ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు సమర్పించనుందని, ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుందని, మొత్తం 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అంటున్నాయి. అయితే, ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం, ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉండడం గండాలని పేర్కొంటున్నాయి.


వాడీవేడిగా సమావేశాలు

బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరంపై కమిషన్‌ విచారణ నివేదికలపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉన్నందున.. ఈ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. కేసీఆర్‌ కేంద్రీకృతంగానే పీసీ ఘోష్‌ కమిటీ నివేదిక ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన సమాధానం ఇచ్చేందుకు సమావేశాలకు వస్తారా? లేక డుమ్మా కొడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపుకమిషన్‌ నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి లేదా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల్లో ఎవరో ఒకరు సభలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులూ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో శాసనసభ వేదికగా బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ సర్కారు సమాయత్తమవుతోంది. అలాగే రాష్ట్రంలో వరద పరిస్థితులు, యూరియా కొరతపైనా చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పోలీసు శాఖ, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు కూడా అధికారులు సంపూర్ణంగా సహకరించాలని స్పీకర్‌ కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని త్వరగా అందించాలన్నారు. సమావేశాలు సజావుగా జరిగేలా పోలీసు శాఖ తరఫున చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నోడల్‌, లైజనింగ్‌ అధికారులను నియమించాలని కోరారు.


  • బీఆర్‌ఎ్‌సలో వణుకు మొదలైంది.. కాళేశ్వరంపై చర్చతో బండారం బయటపడుతుంది: ఆది శ్రీనివాస్‌

కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ నివేదికపై అసెంబ్లీలో చర్చ అనగానే బీఆర్‌ఎ్‌సలో వణుకు మొదలైందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. అందుకే అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు అనుమతివ్వాలంటూ ఆ పార్టీ అడుగుతోందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు అనుమతివ్వాలంటూ అప్పటి సీఎల్పీ కోరితే పట్టించుకోలేదని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడంతో తెలంగాణ ప్రతిష్ఠ గంగలో కలిసిపోయిందని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వంలో ఉందన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందని, ఆ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు అన్ని విషయాలూ చెప్పుకోవచ్చని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 07:03 AM