స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 30 రోజుల్లో తేల్చేస్తాం!
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:48 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
హైకోర్టును గడువు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం
కోటా ఖరారైన 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తాం: ఎన్నికల సంఘం
సర్పంచ్‌ల పదవీకాలం ముగిసేలోపే జరపాలి కదా?.. ఇంకెంతకాలం?: హైకోర్టు
సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మేరకే చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ వివరణ
మాజీ సర్పంచ్‌ల పిటిషన్లపై తీర్పు రిజర్వు
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎ్‌సఈసీ) తమ సమ్మతి(కాంకరెన్స్) తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఎన్నికల సంఘానికి ఆసక్తి కొరవడిందని పిటిషనర్లు అయిన మాజీ సర్పంచులు హైకోర్టుకు నివేదించారు. నల్గొండ జిల్లా తాకట్లెపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచి కొప్పుల పార్వతి, నల్గొండ జిల్లాలోని మరో ఐదుగురు తాజా మాజీ సర్పంచులు గ్రామ పంచాయతీ ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని కోరుతూ 2024 జనవరి 31న పిటిషన్లు దాఖలు చేశారు. సదరు పిటిషన్‌లు పలుమార్లు వాయిదాపడి తాజాగా సోమవారం జస్టిస్ టీ మాధవీదేవి ఽఏకసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదించారు. ‘‘2024 జనవరి 31తో పంచాయతీల పదవీకాలం పూర్తయింది.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, ఎస్‌ఈసీ చొరవ చూపించడం లేదు. ఆలస్యానికి కారణం తాము కాదంటూ పరస్పరం ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారు. పంచాయతీల పదవీకాలం ముగిసే లోపే ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టం నిర్దేశిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రాకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ పని ఎందుకు చేయడం లేదు?’’ అని న్యాయవాది ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణలో ఆలస్యమైన మాట వాస్తవమే అయినప్పటికీ దానికి బలమైన కారణాలు ఉన్నాయని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దానికి కొంత సమయం పట్టిందని తెలిపారు.
సుప్రీం చెప్పినట్లుగా కేవలం రిజర్వేషన్లు నిర్ధారించేందుకే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేశామని, శాస్త్రీయంగా బీసీల లెక్కలు తీశామని, ఇక రిజర్వేషన్ల ప్రకటనే మిగిలిందని వివరించారు. మరో 30 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. 30 రోజుల్లో చేసి తీరతామని, మళ్లీ గడువు పొడిగింపు అడగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించి సమ్మతి తెలియజేసిన తర్వాత 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాదనలు విన్న ఽధర్మాసనం పంచాయతీల పదవీ కాలం పూర్తయి ఏడాదిన్నర కావొస్తోందని గుర్తు చేసింది. రీజనబుల్ టైం అంటే ఎంత అని ప్రశ్నించింది. పదవీకాలం ముగిసే లోపే ఎన్నికలు పెట్టాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.