Share News

TG Govt: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదల

ABN , Publish Date - Feb 27 , 2025 | 03:58 AM

మహాశివరాత్రి రోజున తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కూలీలకు శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసింది.

TG Govt: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదల

  • ఎన్నికల కోడ్‌ లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జమ

  • రూ.6 వేల చొప్పున 66,640 మందికి రూ.39.98 కోట్ల భరోసా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి రోజున తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కూలీలకు శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.39.98 కోట్ల నిధులను బుధవారం జమ చేసింది. ఈ పథకాన్ని జనవరి 26న ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉన్న అర్హులైన కూలీలందరికి పథకాన్ని వర్తింపజేశారు. పథకం ప్రారంభం సందర్భంగా 18,180 మందికి రూ.6 వేల చొప్పున రూ.10.90 కోట్లు జమ చేశారు. ఆ తరువాత మండలి ఎన్నికల కోడ్‌ రావడంతో పథకం అమలు నిలిచిపోయింది.


ఎన్నికల కోడ్‌ అమలులో లేని జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డిని మంత్రి సీతక్క కోరడంతో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉన్న ఉపాధి కూలీలు 66,640 మందికి రూ.39.98 కోట్లను జమ చేసింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 83,420 మంది ఉపాధి కూలీలకు రూ.50.88 కోట్లు నిధులు ఖర్చు చేసింది. ఈ పథకం ద్వారా అందించే నిధులు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వ్యవసాయ కూలీ పనుల మీదనే ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఏడాదికి రెండు విడతల్లో ఒక్కో విడతకు రూ.6 వేల చొప్పున రూ.12 వేల సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.

Updated Date - Feb 27 , 2025 | 03:58 AM