Share News

Health Department: సర్కారు ఉద్యోగైతే వెయిటేజ్‌ కట్‌ ?

ABN , Publish Date - May 03 , 2025 | 04:56 AM

వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగ నియామకాల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మళ్లీ పోటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వెయిటేజీ (గత అనుభవానికి ఇచ్చే పాయింట్లు) ఇవ్వకూడదని అనుకుంటుంది.

Health Department: సర్కారు ఉద్యోగైతే వెయిటేజ్‌ కట్‌ ?

  • వైద్య పోస్టుల భర్తీలో ప్రభుత్వ ఆలోచన

  • న్యాయసలహా తర్వాత అధికారిక ప్రకటన

  • స్టాఫ్‌నర్సు పరీక్ష రాసిన వాళ్లలో వెయ్యి మంది రెగ్యులర్‌ నర్సులు

  • ఫలితాల ప్రకటనలో జాప్యం అందుకే

  • 5న స్టాఫ్‌నర్సు, 12న ఫార్మసిస్టు ఫలితాలు

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగ నియామకాల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మళ్లీ పోటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వెయిటేజీ (గత అనుభవానికి ఇచ్చే పాయింట్లు) ఇవ్వకూడదని అనుకుంటుంది. ఈ విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం.. త్వరలోనే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ కారణం వల్లే వైద్య ఆరోగ్య శాఖలోని 6,170 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాల ప్రకటనలో జాప్యం నెలకొంది.


అసలేం జరిగిందంటే...

వైద్య శాఖ పరిధిలోని 1284 ల్యాబ్‌ టెక్నీషియన్‌(ఎల్టీ), 2,322 స్టాఫ్‌ నర్సు, 633 ఫార్మసిస్టు, 2000 ఎంపీహెచ్‌ఎ్‌స పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు 2024 చివర్లో జరిగాయి. అయితే, ఇప్పటికే వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ స్టాఫ్‌ నర్సులు, ఎల్టీలు, ఫార్మసిస్టులుగా పని చేస్తున్న సుమారు 1200-1300 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. తాము ఉద్యోగం చేస్తున్న ప్రాంతం, ఆస్పత్రి, విభాగం నచ్చక వీరంతా ఈ పరీక్షలకు హాజరైనట్టు సమాచారం. కొత్త రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించి నచ్చిన చోటో లేదా మెరుగైన విభాగంలో ఉద్యోగం పొందాలనేది వీరి ఆలోచన. సాధారణంగా అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న వారైతే వెయిటెజీ కింద గరిష్ఠంగా 20 పాయింట్లు ఇస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. అయితే, ఇప్పటికే రెగ్యులర్‌ ఉద్యోగులుగా ఉన్నవారు గత నియామకాల సమయంలో తమ వెయిటేజీని వినియోగించుకున్నారు. మళ్లీ వారు తాజా నియామకాల్లోనూ వెయిటెజీ క్లైయిమ్‌ చేసుకుంటే తాము నష్టపోతామంటూ నిరుద్యోగ అభ్యర్థులు వాదిస్తున్నారు. దీంతోనే ప్రభుత్వం వెయిటేజీ అంశంపై దృష్టి సారించింది. ఇప్పటికే రెగ్యులర్‌ ఉద్యోగిగా ఉంటూ రాత పరీక్షలో ఎంపికైన వారికి వెయిటేజీ క్లైయిమ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించకూడదని భావిస్తోంది. ఒకవేళ మెరిట్‌లో వస్తే మాత్రం వారిని పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తోంది. ఈ చర్యల వల్ల కనీసం వెయ్యి మంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని సర్కారు భావన.


ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థుల ఆందోళన

ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పలువురు అభ్యర్థులు శుక్రవారం మెడికల్‌ బోర్డు వద్ద ఆందోళన చేశారు. మెడికల్‌ బోర్డు కార్యదర్శి గోపికాంత్‌రెడ్డిని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. మే 5న స్టాఫ్‌నర్సు, 12న ఫార్మసిస్టు ఫలితాల విడుదలకు కృషి చేస్తామని ఆయన చెప్పగా.. అభ్యర్థులు ఆందోళన విరమించారు.

Updated Date - May 03 , 2025 | 04:57 AM