Supreme Court: ‘రాయలసీమ’పై న్యాయ పోరాటమే
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:23 AM
గోదావరి-బనకచర్ల అనుసంధానంతోపాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం పై న్యాయ పోరాటం చేయాలని, ఇందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

‘గోదావరి-బనకచర్ల’పైనా సుప్రీంకు
అనుమతి లేని వాటిని అడ్డుకుందాం
భద్రాచలం చుట్టూ రక్షణ గోడకు కేంద్ర సాయం కోరదాం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్ల అనుసంధానంతోపాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం పై న్యాయ పోరాటం చేయాలని, ఇందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నీటి ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని అన్నారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం పడనుందని పునరుద్ఘాటించారు. వీటిపై మున్ముందు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి వీలుగా న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ స్టాండింగ్ కౌన్సెల్, అడ్వకేట్ జనరల్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టిగా పోరాడాలని అధికారులకు నిర్దేశించారు. రాయలసీమకు 200 టీఎంసీలను తరలించడానికి రూ.80 వేల కోట్లతో ఏపీ ప్రతిపాదించిన గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డుకు, ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014కు వ్యతిరేకమని తెలిపారు.
గోదావరి-కృష్ణాపై ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సీడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకొని, గోదావరి, కృష్ణా బోర్డులతో డీపీఆర్‌లను పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుందని, తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని, కానీ, ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టును ఏపీ ముందుకు తీసుకెళుతోందని తెలిపారు. ఇక , శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించడానికి వీలుగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గతంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశామని, నిరంతర ప్రయత్నాల ఫలితంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిపుణుల అంచనాల కమిటీ గత ఫిబ్రవరిలో ప్రాజెక్టు వద్ద పూర్వస్థితిని పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టుతో పాటు ఇతర చోట్ల తెలంగాణ అభ్యంతరాల వల్లే రాయలసీమకు పర్యావరణ అనుమతి రాలేదన్నారు. అయినా, ఇతర మార్గాల ద్వారా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని, దీన్ని చూస్తూ ఊరుకోమని, అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ముంపు బారిన పడకుండా భద్రాచలం చుట్టూ రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర సహాయాన్ని కోరుతామని చెప్పారు. ప్రాజె క్టుల నిర్మాణంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, సత్వర నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రిజర్వాయర్లలో పూడికతీత పనులకు త్వరలో టెండర్లు పిలవాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News