Share News

Medical Colleges: బోధనాస్పత్రులకు కలెక్టర్ల వైద్యం!

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:51 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల అభివృద్ధి, అత్యుత్తమ సేవలు అందేలా చూసే బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.

Medical Colleges: బోధనాస్పత్రులకు కలెక్టర్ల వైద్యం!

  • ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రుల

  • అభివృద్ధి బాధ్యత అప్పగిస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం

  • రోగులకు సేవలు, భోజనం, పారిశుధ్యం, భద్రత పర్యవేక్షణ

  • గ్రామీణ ప్రాంతాల రోగులు బోధనాస్పత్రులకు వచ్చేలా చర్యలు

  • ప్రత్యేకంగా షటిల్‌ బస్సులు.. ఔట్‌ పేషంట్‌, ఇన్‌పేషంట్‌ సంఖ్యను పెంచడంపై దృష్టి

  • కాలేజీలు, బోధనాస్పత్రుల తనిఖీ కమిటీల్లో కలెక్టర్లకు చోటు.. జూన్‌ 25-29 దాకా తనిఖీలు

  • 30న సర్కారుకు నివేదిక.. 2028 జూన్‌ నాటికి వందశాతం సౌకర్యాల కల్పన లక్ష్యం

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల అభివృద్ధి, అత్యుత్తమ సేవలు అందేలా చూసే బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. గ్రామీణ ప్రాంతాల రోగులు బోధనాస్పత్రికి వచ్చేలా చూడటం నుంచి వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేదాకా కీలక అంశాలను పర్యవేక్షించాలని సూచించింది. దీనితోపాటు వైద్య కళాశాలల్లో లోపాలు, మౌలిక సదుపాయాల లేమిని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ‘మెడికల్‌ కాలేజీ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ)‘ల్లోనూ జిల్లా కలెక్టర్లను భాగస్వామ్యం చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు (జీవో నం. 276) జారీ చేసింది. తెలంగాణలో 34 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఆస్పత్రులు ఉన్నాయి. హైదరాబాద్‌లో నాలుగు, జిల్లాల్లో 30 వైద్య కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు ఉన్నాయి. జాతీయ వైద్య కమిషన్‌ నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల మేరకు వీటిలో 2028 జూన్‌ నాటికి.. అన్ని రకాల వసతులను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనుంది.


కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు

  • వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను సమీక్షించి, జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో వెంటనే భర్తీ చేయాలి.

  • బోధనాస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న భోజనం ఎలా ఉంటోంది? కాంట్రాక్టర్లు డైట్‌ మెనూ పాటిస్తున్నారా అన్నది పర్యవేక్షించాలి. లోపాలు ఉంటే డైట్‌ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవచ్చు.

  • వైద్య కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో రోగులకు సేవలు, పారిశుద్ధ్యం, భద్రతను పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టాలి. ఆస్పత్రి అభివృద్ధి నిధులను పకడ్బందీగా వినియోగించి పనులు చేయాలి.

  • జిల్లా పాలనా యంత్రాంగమంతా కలెక్టర్‌ చేతుల్లోనే ఉండే నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ బోధనాస్పత్రులను ఎక్కువగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం గ్రామాల నుంచి బోధనాస్పత్రులకు షటిల్‌ సర్వీస్‌ బస్సులను నడపాలి. బోధనాస్పత్రుల్లో ఔట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టాలి. ఉచితంగా అందించే ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలి.

  • బోధనాస్పత్రుల్లో అందించే వైద్య సేవలు, నిర్వహించే సర్జరీలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలి. క్షేత్రస్థాయి వైద్యారోగ్య సిబ్బందితోపాటు, ఇతర విభాగాల సిబ్బందినీ ఇందులో భాగస్వాములను చేయాలి.

  • ఆసిఫాబాద్‌ వంటి కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన మృతదేహాలు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని గుర్తు తెలియని మృతదేహాలు, ప్రమాద మృతుల దేహాలను వైద్య కళాశాలలకు అందించేలా చొరవ తీసుకోవాలి.

  • మౌలిక సదుపాయాల మొదటి అంశంలో భాగం గా ప్రతీ కాలేజీలో అకడమిక్‌ భవనాలు, లెక్చర్‌ హాళ్లు, ల్యాబ్‌లు, హాస్టళ్లు, బోధనాస్పత్రుల్లో పడకల సంఖ్య, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, నీటి సరఫరా, శానిటేషన్‌ స్థితిని పరిశీలిస్తారు.

  • రెండో అంశం మానవ వనరుల (హ్యూమన్‌ రిసోర్స్‌)లో భాగంగా.. అధ్యాపకులు, ఇతర సిబ్బంది పోస్టులు ఎన్ని? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారన్నది గుర్తిస్తారు.

  • మూడో అంశం అకడమిక్‌ కరిక్యులమ్‌లో భాగంగా.. జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనల మేరకు బోధన ప్రణాళిక అమలు చేస్తున్నారా లేదా పరిశీలిస్తారు.

  • నాలుగో అంశం విద్యార్ధుల సంక్షేమం, సౌకర్యాల్లో భాగంగా.. మెడికోలకు కల్పిస్తున్న వసతి సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత, వారి భద్రత, ర్యాగింగ్‌ నిరోధ చర్యలు, విద్యార్ధులకు కౌన్సిలింగ్‌, మెడికోల ఫిర్యాదులపై స్పందన తీరు వంటివి పరిశీలిస్తారు.

  • ఐదో అంశం ఆర్థికపరమైన అంశాల కింద.. అవసరమైన నిధులను లెక్కిస్తారు.

  • ఆరో అంశం డిజిటల్‌ వ్యవస్థల్లో భాగంగా.. ముఖ గుర్తింపు ఆధారిత హాజరు అమలు, సీసీటీవీ, ఇంటర్నెట్‌ సౌకర్యం వంటి సౌకర్యాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు.


25 నుంచి తనిఖీలు

మౌలిక సదుపాయాల కొరత, ఇతర లోపాలపై జాతీయ వైద్య కమిషన్‌ ఇటీవల రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశం మేరకు వైద్యారోగ్య శాఖ పది ‘మెడికల్‌ కాలేజీ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ)’లను ఏర్పాటు చేసింది. ఈనెల 25 నుంచి 29 తేదీ మధ్య ఈ కమిటీలు విస్తృతంగా తనిఖీలు చేపడతాయి. మౌలిక సదుపాయాల కొరత, లోపాలు, సమస్యలపై కళాశాల వారీగా నివేదికలను రూపొందించి 30న ప్రభుత్వానికి అందజేయనున్నాయి. అలాగే కళాశాల వారీగా చేపట్టాల్సిన చర్యల (యాక్షన్‌ ప్లాన్‌)ను కూడా సూచించనున్నాయి. ప్రధానంగా ఆరు అంశాలపై కమిటీలు దృష్టిసారించనున్నాయి.


ఇవి కూడా చదవండి..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2025 | 04:51 AM