Bhatti Vikramarka: చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి నిధులిస్తాం
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:38 AM
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దుతాం: భట్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ(కోఠి ఉమెన్స్ కాలేజ్)ని గురువారం ఆయన సందర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న వారసత్వ భవనాలను పునరుద్ధరించడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు.
తరగతి గదులు, లేబొరేటరీలు, గ్రంథాలయం, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది వసతి గృహాలు, వైస్ చాన్స్‌లర్ కార్యాలయం, అతిథి గృహం, ఆడిటోరియం, పరిపాలన విభాగ భవన నిర్మాణ ప్రదేశాలు, నిర్మాణ నమూనాలను భట్టి పరిశీలించారు. ఇటీవల పునరుద్ధరించిన దర్బార్ మహల్ హెరిటేజ్ బిల్డింగును కూడా పరిశీలించారు. నూతనంగా నిర్మించే భవన నమూనాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్తగా నిర్మించే భవనాలు రాబోయే తరాలకు వారసత్వ కట్టడాలుగా నిలవాలని, అందుకు తగిన విధంగా ఆకృతులు ఉండాలని డిప్యూటీ సీఎం చెప్పారు.