Share News

Rajeev Youth Vikasam: నిరుద్యోగులకు రాజీవ్‌ యువ వికాసం

ABN , Publish Date - Mar 12 , 2025 | 03:39 AM

నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత కోసం ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

Rajeev Youth Vikasam: నిరుద్యోగులకు రాజీవ్‌ యువ వికాసం

  • ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపు

  • కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం

  • రూ.6000 కోట్ల కేటాయింపు

  • 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

  • జూన్‌ 2న మంజూరు పత్రాల అందజేత

  • డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి.. గత సర్కారు యువతను విస్మరించిందని విమర్శ

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత కోసం ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మంది యువతకు ఈ పథకం కింద స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ సర్కారు నిరుద్యోగ యువతను పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్లకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే యువతకు స్వయం ఉపాధి పథకాలను అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలు సీఎం వద్ద, బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్‌ వద్ద ఉన్నాయని తెలిపారు. యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వారు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారన్నారు. ఇప్పటికే టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని, ఇంకా మిగిలిపోయిన వారికి స్వయం ఉపాధి పథకాలను అందించాలని నిర్ణయించామని చెప్పారు.


అందులో భాగంగానే రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కిందో ఒక్కో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగికి రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. రాష్ట్రంలోని 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ సాయం అందిస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.6000 కోట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఒక్కొక్కరికి అందించే ఆర్థిక సహాయంలో బ్యాంకు లింకేజీ ఉంటుందన్నారు. రూ.3 లక్షలు పూర్తిగా సబ్సిడీనా? బ్యాంకు రుణమా? ఎంత శాతం సబ్సిడీ? అనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని భట్టి చెప్పారు. విధివిధానాలు, లబ్ధిదారుల అర్హతలు వంటి వివరాలను కూడా ప్రకటిస్తామన్నారు. లబ్ధిదారుల వయసు 55 ఏళ్లకు మించి ఉండరాదని తెలిపారు. పథకానికి సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, ఏప్రిల్‌ 5 వరకు నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఏప్రిల్‌ 6 నుంచి మే 31 వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న స్వయం ఉపాధి పథకాల మంజూరు పత్రాలను అందజేస్తామని తెలిపారు.


చాకలి ఐలమ్మ వర్సిటీకి రూ.540 కోట్లు

చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి రూ.540 కోట్లను కేటాయించినట్లు భట్టి తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత యూనివర్సిటీ ప్రధాన ద్వారాన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. వర్సిటీ ప్రాంగణంలోని వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రూ.15.5 కోట్లు, నూతన భవన నిర్మాణాలకు రూ.100 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు

Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..

Updated Date - Mar 12 , 2025 | 03:39 AM