ఆరోగ్య శాఖలో రిటైర్డ్ అధికారులకు చెక్
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:55 AM
వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి ఇన్‌చార్జి హోదాల్లో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారులను తొలగించే ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టింది.
16 మందిని తొలగిస్తూ ఉత్తర్వుల జారీ
ఆరోగ్యశ్రీలో 8 మంది, టీజీఎంఎ్‌సఐడీసీ, ఎన్‌హెచ్‌ఎంలో నలుగురు చొప్పున
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి ఇన్‌చార్జి హోదాల్లో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారులను తొలగించే ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆరోగ్యశ్రీ, జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌హెచ్‌ఎం), తెలంగాణ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ) తదితర విభాగాల్లోని మొత్తం 16 మంది పదవీ విరమణ పొందిన అధికారులను తొలగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్.చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్యశ్రీలో 8 మంది, టీజీఎంఎ్‌సఐడీసీ, ఎన్‌హెచ్‌ఎంలో నలుగురేసి రిటైర్డ్ అధికారులను తొలగించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి తొలగించిన 8 మందిలో ముగ్గురు డాక్టర్లు, ఐదుగురు నాన్-టెక్నికల్ అధికారులు ఉన్నారు.
ప్రజారోగ్య సంచాలకులు (డీపీహెచ్), తెలంగాణ వైద్య విధాన పరిషత్, వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), డ్రగ్ కంట్రోల్, ఆయుష్ విభాగాల్లోనూ రిటైర్డ్ అధికారులను తొలగించడానికీ రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయా విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు కోరారు. పదవీ విరమణ తర్వాత ఎన్ని రోజుల నుంచి వారు పని చేస్తున్నారు? వారి ప్రవర్తన ఎలా ఉంది? వాళ్లనే కొనసాగించాల్సిన అవసరం ఏముంది? వంటి అంశాలపై స్పష్టమైన వివరాలు పంపించాలని అడిగారు. దీంతో ఆయా విభాగాల హెచ్‌వోడీలు నివేదిక తయారుచేస్తున్నట్లు తెలిసింది.