GST Rate Rationalization: రాబడికి భద్రతేది?
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:58 AM
జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించే సమయంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క అన్నారు.
జీఎస్టీ హేతుబద్ధీకరణతో తెలంగాణకు 7వేల కోట్ల నష్టం
రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి
పన్ను తగ్గింపు.. పేద, మధ్య తరగతికి లబ్ధి చేకూర్చాలి
రాబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సందేహాలన్నీ లేవనెత్తుతాం
జీఎస్టీ హేతుబద్ధీకరణ సంప్రదింపుల సమావేశంలో భట్టి
రాష్ట్రంలో వరద నష్టం నివేదిక కేంద్రానికి పంపుతామని వెల్లడి
జీఎస్టీ రేట్లు మారిస్తే రాష్ట్రాల రాబడికి 2 లక్షల కోట్ల గండి
ఆర్థికం కుదేలవుతుంది.. అభివృద్ధి పనులు నిలిచిపోతాయి
ఈ నష్టాన్ని కేంద్రం చెల్లిస్తుందా? 8 ప్రతిపక్ష రాష్ట్రాల ప్రశ్న
న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించే సమయంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. రేట్ల హేతుబద్ధీకరణతో తెలంగాణకు రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. సహకార సమాఖ్యవాద స్ఫూర్తితో, కేంద్రం నేరుగా లేదా కౌన్సిల్ ద్వారా రాష్ట్రాలను సంప్రదించాలని, కానీ.. రేట్ల హేతుబద్ధీకరణ ప్రకటన ఏకపక్షంగా జరిగిందని అన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయని, నిధులు అవసరమని తెలిపారు. సరైన పన్ను విధింపు.. రాష్ట్ర అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఈ మేరకు జీఎస్టీని ప్రస్తుతం విధిస్తున్న 5, 12, 18, 28 శాతం స్లాబ్‌లలో కాకుండా.. రెండు స్లాబ్‌లలో 5 నుంచి 18 శాతం మఽధ్య నిర్ణయించాలని, అతివిలాస, హానికర వస్తువులపై మాత్రమే 40 శాతం జీఎస్టీ విధించాలని కేంద్రం సూచించింది. దీంతో ఎనిమిది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌ల ఆర్థిక మంత్రులు శుక్రవారం ఢిల్లీలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రాలకు తగ్గే ఆదాయానికి పరిహారం చెల్లిస్తామంటూ జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో జీఎస్టీ ద్వారా ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేశారని, కానీ.. ఆశించినంతగా ఏమీ జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక స్వేచ్ఛతో వ్యాట్‌ను కొనసాగించి ఉంటే 2024-25కు ఆదాయం రూ.69,373 కోట్లు ఉండేదని, కానీ.. జీఎస్టీ ద్వారా ఆదాయం రూ.42,443 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో జీఎస్టీ వసూళ్లు 39 శాతమేనని, అందువల్ల జీఎస్టీ రేట్లలో ఏమైనా తగ్గింపులు ఉంటే.. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. తెలంగాణ జీఎస్టీ, జీఎ్‌సడీపీ నిష్పత్తి 2022- 23లో 3.07 శాతం నుంచి 2024 - 25లో 2.58 శాతానికి క్రమంగా తగ్గుతోందని, రేటు హేతుబద్ధీకరణ దీనిని మరింత తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు తెలంగాణ మద్దతు ఇస్తుందని, కానీ రెండు తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని భట్టి డిమాండ్ చేశారు. మొదటిది.. రాష్ట్రాల ఆదాయాలను రక్షించాలని, రాష్ట్రాలు సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్యక్రమాలను కొనసాగించేలా తగిన పరిహార విధానాన్ని రూపొందించాలని అన్నారు. రెండోది.. పన్ను తగ్గింపు లేదా మినహాయింపు నిజంగా సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాల సమూహాలకు చేరేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబరు 3న మరోసారి సమావేశమై కీలక అంశాలపై చర్చించి.. కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. కేంద్ర నిర్ణయంతో చాలా రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, అందులో.. ఎన్డీయే పాలిత రాష్ట్రాలూ ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే, జీఎస్టీ హేతుబద్ధీకరణ అంశంపై కేంద్రం మరింత లోతుగా ఆలోచించాలని కోరారు. కాగా, తెలంగాణలో వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారని తెలిపారు. వీలైనంత త్వరగా నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించి ఆర్థికసాయం కోరతామన్నారు.
రాష్ట్రాల ఆదాయానికి రూ.2 లక్షల కోట్ల నష్టం..
జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల రాష్ట్రాల ఆదాయానికి రూ.1.5 లక్షల కోట్లనుంచి రూ.2 లక్షల కోట్ల మేరకు గండి పడుతుందని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తెలిపాయి. తమకు ఈ నష్టాన్ని ఎలా చెల్లిస్తారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని సవాల్ చేశాయి. కొత్త జీఎస్టీ వల్ల రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోవడం మాత్రమే కాకుండా.. ఆదాయం బాగా తగ్గిపోయి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. విలాస వస్తువుల మీద అదనపు లెవీపై వచ్చే వసూళ్ల ఆధారంగా కేంద్రం రుణాలను సేకరించి తమకు చెల్లించాలని ఆర్థిక మంత్రుల సమావేశంలో డిమాండ్ చేశాయి. సెప్టెంబరు 3, 4 తేదీల్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తాలని, నష్టపరిహారం చెల్లించేందుకు ఒక యంత్రాంగం ఏర్పాటు కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. విలాస వస్తువులపై 40 శాతానికి పైగా అదనపు సుంకాన్ని విధించి.. ఆ ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాలని కేంద్రానికి సూచించాయి. కాగా, జీఎస్టీ రేట్ల హేబద్ధీకరణ వల్ల 15 నుంచి 20 శాతం ఆదాయాన్ని కోల్పోతుందని, దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలవుతుందని కర్ణాటక ఆర్థిక మంత్రి బైరెగౌడ అన్నారు. రాష్ట్రాల ఆదాయాలు కుదుటపడే వరకు ఐదేళ్లపాటు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో భట్టివిక్రమార్క, కృష్ణ బేరెగౌడతోపాటు పంజాబ్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..