యూరియా కోటాలో కోత!
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:36 AM
రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎ్‌ఫసీఎల్) నుంచి రాష్ట్రానికి అందాల్సిన యూరియాలో కోత పడుతోంది.
ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి రాష్ట్ర కోటా సగానికి తగ్గింపు
2024 ఏప్రిల్-జూన్ మధ్య 1.3 లక్షల టన్నుల సరఫరా
ఈ ఏడాది మాత్రం 71 వేల టన్నులకే పరిమితం
జూలై నెల కోటా... 30వేల టన్నులకు కుదింపు
కోల్‌సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎ్‌ఫసీఎల్) నుంచి రాష్ట్రానికి అందాల్సిన యూరియాలో కోత పడుతోంది. వర్షాకాలం సీజన్‌లో సాగు ఊపందుకోవడంతో రైతులు యూరియా కోసం బారులుదీరుతుండగా, రాష్ట్ర విజ్ఞప్తులను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్(డీవోఎఫ్) పట్టించుకోని పరిస్థితి ఉంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉన్నా.. మొండి చేయి తప్పడం లేదు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో మూసేసిన ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)యూనిట్‌ను కేంద్రం పునరుద్ధరించిన విషయం తెలిసిందే. 12లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన ఫ్యాక్టరీలో మూడేళ్లుగా ఉత్పత్తి కొనసాగుతోంది. ఇందులో తెలంగాణకు సైతం 11శాతం వాటా ఉంది. ఆయా రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం, యూరియా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ సారథ్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్(డీవోఎఫ్) కోటాలు కేటాయిస్తుంది. గత ఏడాది 11.94లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరిగితే.. రాష్ట్రానికి 4.68లక్షల టన్నులు(సుమారుగా 45శాతం) రవాణా చేశారు.
మిగిలిన యూరియాను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేశారు. కానీ, ఈసారి అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. ఆర్‌ఎ్‌ఫసీఎల్ నుంచి గత ఏడాది ఏప్రిల్- జూన్ మధ్య 1.3లక్షల టన్నుల యూరియాను రాష్ట్రానికి సరఫరా చేస్తే... ఈ ఏడాది అది 71,773 టన్నులకే పరిమితమైంది. గత ఏడాది జూలైలో 60వేల టన్నుల కోటాను కేటాయిస్తే... ఈ ఏడాది దాన్ని 30వేల టన్నులకు కుదిరించారు. సాధారణంగా తెలంగాణలో ఏటా 20లక్షల టన్నుల యూరియా వినియోగం ఉంటుంది. ఇందులో వర్షాకాల సీజన్‌లో 10-11లక్షల టన్నుల డిమాండ్ ఉంటుంది. అయితే, వ్యవసాయంలో యూరియా వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్రం నిర్ణయం మేరకు అన్ని రాష్ట్రాల కోటాల్లో కోత విధించామని అధికారులు చెబుతున్నారు. కానీ, తెలంగాణ మాదిరిగా ఇతర రాష్ట్రాల కేటాయింపుల్లో పెద్దగా కోతలు విధించిన దాఖలాలు కనబడడం లేదు. గత ఏడాది జూలైలో ఉత్తరప్రదేశ్‌కు 3.5 లక్షల టన్నుల యూరియాను కేటాయించిన డీఎ్‌ఫవో..ఈ ఏడాదీ అంతే మొత్తంలో కేటాయించింది. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణ కోటాకు కోత పెట్టి, ఇతర దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించినట్లు తెలిసింది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి 12 లక్షల టన్నుల యూరియా: ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రబీ సీజన్‌కు సంబంధించి 12 లక్షల టన్నుల యూరియాను పంపిణీ చేసిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. అవసరమయితే ఇంకా అదనంగా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం ఎరువుల సబ్సిడీ రూపంలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి