Government Schools: అడుగడుగునా అపరిశుభ్రత
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:02 AM
ప్రభుత్వ పాఠశాలల్లో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర సర్కారును కోరింది. ప్రస్తుత పథకంలో అనేక లోపాలున్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని విజ్ఞప్తి చేసింది.

చెట్ల కింద, మరుగుదొడ్ల పక్కనే వంటలు
నెలల తరబడి మంజూరు కాని బిల్లులు
మధ్యాహ్న భోజనంతో విద్యార్థుల్లో అస్వస్థత
3.37 లక్షల మంది విద్యార్థులు తినడం లేదు
సన్నబియ్యం, బగారా, పలావ్ వడ్డించాలి
4 రోజులు గుడ్లు, 2 రోజులు అరటిపండ్లివ్వాలి
జూనియర్ కాలేజీల్లోనూ పథకం అమలు
190 కోట్లు అదనంగా ఇస్తే.. అన్నీ సాధ్యమే
రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసులు
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర సర్కారును కోరింది. ప్రస్తుత పథకంలో అనేక లోపాలున్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసిన కమిషన్ ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందించింది. ఇందులో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అనేక కీలక సూచనలు చేసింది. ఈ పథకం అధ్యయనానికి కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. అనేక పాఠశాలలను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు మధ్యా హ్న భోజన పథకం బాధ్యతలు తీసుకున్న స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడింది. వారి అభిప్రాయాలు తీసుకున్న కమిషన్.. ఈ పథకం మెరుగదలకు సిఫారసులు అందించింది. ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకూ విస్తరించాలని సూచించింది. ఈ పథకానికి కేంద్రం 60శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇస్తున్నాయి. రాష్ట్రం అదనంగా రూ.190 కోట్లు కేటాయిస్తే.. పథకాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని కమిషన్ సూచించింది.
చెల్లింపులు అంతంత మాత్రమే..
విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించిన భోజన మెనూ ఎక్కడా అమలు కావడం లేదని కమిషన్ తెలిపింది. సన్న బియ్యం, కోడి గుడ్లు, తాజా కూరగాయలు, పప్పులతో రోజు వండే మెనూను ప్రభుత్వం పేర్కొంది. కానీ ప్రస్తుతం కేటాయిస్తున్న బడ్జెట్‌లో అవన్నీ అందించే పరిస్థితి లేకుండా పోయింది. 1-5 తరగతుల వరకు ప్రస్తుతం ఒక విద్యార్థికి రూ.8.69, 5-10 తరగతులకు రూ.11.79 చొప్పున అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ధరల్లో నాణ్యమైన భోజనం అందించడం అసాధ్యంగా మారిందని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక వంట గదులు లేకపోవడంతో చెట్ల కింద, మరుగుదొడ్ల పక్కనే భోజనం వండుతున్నారని తెలిపింది. వంట మనుషులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదు. పథకానికి సరఫరా చేసే బియ్యం, సరుకుల్లో నాణ్యత ఉండటం లేదని కమిషన్ వెల్లడించింది. సరైన వంట సౌకర్యం లేకపోవడంతో అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఉడికీ ఉడకని అన్నం తింటూ తరచూ అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1-10 తరగతుల విద్యార్థులు 16.86 లక్షల మంది ఉండగా.. వీరిలో 13.49 లక్షల మంది మాత్రమే భోజనం తింటున్నారు. పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారం లేకపోవడంతో 33,7270 (20ు) మంది మధ్యాహ్న భోజనం తినడం లేదని కమిషన్ తెలిపింది. ప్రభుత్వం ఈ పథకం బాధ్యతలను స్థానిక మహిళా సంఘాలకు అప్పగించింది. అయితే వీరికి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక జిల్లాల్లో 3 నెలల నుంచి 12 నెలల వరకు బిల్లులు రావడం లేదు. దీంతో మహిళలు అప్పు చేసి సరుకులు తెచ్చి ఈ పథకాన్ని మొక్కుబడిగా నడిపిస్తున్నారు. సరిపడా నిధులు లేకపోవడంతో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కమిషన్ తెలిపింది. వంట సమయంలో పరిశుభ్రతకు వంట వారికి ఏటా రెండు జతల కిచెన్ ఆప్రాన్, క్యాప్స్, ఆరు జతల చేతి గ్లవ్స్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని కమిషన్ కోరింది. వంట వారికి ప్రతి నెలా బిల్లులు చెల్లించడంతో పాటు ఒక్కో విద్యార్థికి చేస్తున్న ఖర్చును పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని సిఫారసు చేసింది. దీని కోసం రూ.39 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.190 చెల్లిస్తే మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయవచ్చని సూచించింది. ఇటీవల ప్రభుత్వం గురుకులాల్లో భోజనాల ధరలు పెంచడంతో అక్కడ నాణ్యత పెరిగిందని గుర్తు చేసింది.
ఈ భోజనం పెట్టండి..
మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచడంతోపాటు విద్యార్థులకు సమతుల, పౌష్టికాహారం అందించేందుకు కొత్త మెనూ అమలు చేయాలని విద్యా కమిషన్ సర్కారును కోరింది. తప్పనిసరిగా సన్నబియ్యాన్ని మాత్రమే సరఫరా చేయాలని, వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, రెండు రోజులు అరటిపండు ఇవ్వాలని సూచించింది. సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో సన్నబియ్యంతో వండిన అన్నంతోపాటు కోడిగుడ్డు, కూర, పప్పుచారు అందించాలని కోరింది. గురువారం బగారా అన్నం, టమాటా ఆలుగడ్డ కూరతో పాటు అరటిపండు.. శనివారం వెజిటబుల్ పలావ్, ఆలు, క్యారట్, బీన్స్‌తోపాటు అరటిపండు ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది.
మధ్యాహ్న భోజనంపై ఖర్చు..
తరగతులు మధ్యాహ్న భోజనం ప్రస్తుత ధర సిఫారసు ధర అదనపు భారం
తింటున్న విద్యార్థులు (ఒక విద్యార్థికి) (ఒక విద్యార్థికి) (రూ. కోట్లలో)
1-5 676237 రూ. 8.69 రూ. 13.45 రూ. 61.15
5-8 399984 రూ. 11.79 రూ. 18.6 రూ. 51.75
9-10 272852 రూ. 11.79 రూ. 19.14 రూ. 38.10
ఇంటర్ 1, 2 123978 --- రూ. 21 రూ. 39.05
మొత్తం రూ. 190
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..