Share News

Mudra Society: ముద్ర కో ఆపరేటివ్‌ పేరిట రూ.140 కోట్ల వసూళ్లు

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:23 AM

ముద్ర అగ్రికల్చరల్‌ అండ్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ మల్టీలెవల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ తిప్పినేని రామదాసప్ప నాయుడు, ఆయన కుమారుడు, సొసైటీ డైరెక్టర్‌ సాయి కిరణ్‌ను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

Mudra Society: ముద్ర కో ఆపరేటివ్‌ పేరిట రూ.140 కోట్ల వసూళ్లు

  • 330 శాఖలు, 1600 మంది ఉద్యోగులు, వేలల్లో బాధితులు

  • సేకరించిన డబ్బుతో ఏపీలోని అమరావతిలో పెట్టుబడులు

  • ముద్ర కో ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ తిప్పినేని రామదాసప్ప

  • నాయుడు, అతని కుమారుడు సాయికిరణ్‌ అరెస్టు

  • అమరావతిలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సీఐడీ

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ముద్ర అగ్రికల్చరల్‌ అండ్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ మల్టీలెవల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ తిప్పినేని రామదాసప్ప నాయుడు, ఆయన కుమారుడు, సొసైటీ డైరెక్టర్‌ సాయి కిరణ్‌ను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. చాలాకాలంగా పరారీలో ఉన్న రామదాసప్ప నాయుడు, సాయి కిరణ్‌ను ఏపీ రాజధాని అమరావతిలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ముద్ర పథకం పేరును అనుకరిస్తూ ముద్ర సొసైటీ పేరుతో రామదాసప్ప.. అధిక వడ్డీలు ఆశచూపి ఏజెంట్ల ద్వారా రైతులు, కూలీలు, మహిళల నుంచి రూ.140 కోట్ల నిధులు సేకరించాడు. సీఐడీ అదనపు డైరక్టర్‌ జనరల్‌ చారుసిన్హా కథనం ప్రకారం... రామదాసప్ప నాయుడు ముద్ర అగ్రికల్చరల్‌ అండ్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ మల్టీలెవల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 330 కార్యాలయాలు తెరిచాడు. అందులో 1600 మంది సిబ్బందిని నియమించుకున్నాడు. ఉద్యోగంలో చేర్చుకునేముందు ప్రతి ఒక్కరి విద్యార్హత సర్టిఫికెట్లు, రూ.లక్ష చొప్పున డిపాజిట్‌ సేకరించాడు. తన సొసైటీ రెండేళ్లలో బ్యాంకుగా మారుతుందని ఉద్యోగులను నమ్మించి వారి ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాడు.


అందులో కొంత మొత్తాన్ని ముద్ర రుణాల పేరిట అవసరమైన వారికి ఇచ్చేవాడు. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ..8వేల నుంచి రూ.12వేలు దాకా వేతనం ఇచ్చిన రామదాసప్ప.. ఉద్యోగులకు లక్ష్యాలు పెట్టి అవి సాధించకపోతే జీతంలో కోత పెట్టేవాడు. దీంతో కొందరు ఉద్యోగాలు మానేసి తమ సర్టిఫికెట్లు, డిపాజిట్‌ సొమ్ము ఇవ్వమని కోరితే వారిని వేధించేవాడు. తనకు చెందిన పత్రికల్లో ఆయా ఉద్యోగులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని వార్తలు రాయించేవాడు. ఈ క్రమంలో ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే వారితో రాజీ కుదుర్చుకునేవాడు. కాగా, ముద్ర పథకం అంటూ ప్రజల నుంచి రూ.140 కోట్ల మేర సేకరించిన రామదాసప్ప.. ఆ సొమ్ములో అధిక భాగాన్ని ఏపీ రాజధాని అమరావతిలో స్థలాలపై పెట్టుబడిగా పెట్టాడు. రామదాసప్ప అక్రమాలపై 2020లో నల్లకుంట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదవ్వగా.. అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. దీంతో కాచిగూడ, గంభీరావుపేట, రామాయంపేట, దుబ్బాక, కాచిగూడ, వేములవాడ, అచ్చంపేట, ఆత్మకూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా పరారీలో ఉన్న రామదాసప్ప నాయుడు, సాయి కిరణ్‌ ఎట్టకేలకు అరెస్టు చేసిన సీఐడీ అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 03:23 AM