Suspicious Death: అశ్వారావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:47 AM
ఖమ్మం జిల్లా కల్లూరు మండల వాసి పూల లక్ష్మి ప్రసన్న 33 ఆదివారం అనుమానాస్పద మృతితో సోమవారం 3 గంటల పాటు..
అనుమానాస్పద స్థితిలో లక్ష్మి ప్రసన్న మృతి
అత్తింటి వారి వేధింపులవల్లేనని బంధువుల ఆరోపణ
భర్త, ఆడపడుచు, బావలకు దేహశుద్ధి
అశ్వారావుపేట, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా కల్లూరు మండల వాసి పూల లక్ష్మి ప్రసన్న(33) ఆదివారం అనుమానాస్పద మృతితో సోమవారం 3 గంటల పాటు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆమె మృతి వార్తతో అశ్వారావు పేటకు చేరుకున్న లక్ష్మి ప్రసన్న కుటుంబీకులు, బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాదాపు రెండేళ్లుగా ఆమెను గృహ నిర్బంధం చేసి.. తమతో మాట్లాడనివ్వకుండా సరిగ్గా ఆహారం పెట్టక, బాగోగులు చూడనందుకే పూర్తిగా బక్కచిక్కి మరణించిందని లక్ష్మి ప్రసన్న కుటుంబీకులు ఆరోపించారు. ఆమె భర్త నరేశ్, ఇతర నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. రాజమండ్రి నుంచి అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకొస్తున్నారన్న సమాచారంతో ఆందోళన కారులు రింగ్ రోడ్డు సెంటర్ వద్ద బైఠాయించారు. అదే సమయంలో ఏ-2 నిందితుడిగా ఉన్న నరేశ్ బావ శ్రీను పోలీసు వాహనాన్ని నడుపుకుంటూ రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మృతురాలు ఆడబడుచు దాసరి భూలక్ష్మికి లక్ష్మి ప్రసన్న బంధువులు, భర్త నరేశ్, నరేశ్ బావ శ్రీనులకు కొందరు యువకులు దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితులను స్టేషన్‌కు తరలించారు. కేసును తప్పుదోవ పట్టించట్లేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, దర్యాప్తు తర్వాత అందుకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని లక్ష్మి ప్రసన్న బంధువులకు నచ్చచెప్పారు. చివరకు మృతదేహాన్ని భర్త ఇంటికి తరలించారు. భర్త కుటుంబీకులందరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మృతురాలి అంత్యక్రియలకు వారి బంధువులు ముందుకు రాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి లక్ష్మి ప్రసన్న బంధువులు నిరాకరించారు. మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక యువకులు.. మృతురాలి ఏడేళ్ల కూతురు ఇనివితతో తల్లి చితికి నిప్పంటించిన దృశ్యాలు చూపరులను కలచివేశాయి.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News