Share News

Texas Shooting Incident: టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. తెలుగు వ్యక్తి మృతి

ABN , Publish Date - Oct 04 , 2025 | 04:13 PM

గురువారం రాత్రి చంద్రశేఖర్ డ్యూటీలో ఉండగా ఊహించని దారుణం జరిగింది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా చంద్రశేఖర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్ గాయాల కారణంగా అతను చనిపోయాడు.

Texas Shooting Incident: టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. తెలుగు వ్యక్తి మృతి
Texas Shooting Incident

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. డల్లాస్‌‌లో జరిగిన కాల్పుల్లో 27 ఏళ్ల తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లాడు. ఆరు నెలల క్రితం మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.


ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ చేస్తున్నాడు. గురువారం రాత్రి అతడు డ్యూటీలో ఉండగా ఊహించని దారుణం జరిగింది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా చంద్రశేఖర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్ గాయాల కారణంగా చంద్రశేఖర్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ మరణం గురించి తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు సాయం చేయాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.


స్పందించిన సీఎం రేవంత్..

చంద్రశేఖర్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీ నగర్‌కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

వన్డే, టీ20 స్క్వాడ్‌‌లను ప్రకటించిన బీసీసీఐ.. ఎవరెవరు ఉన్నారంటే..

హ్యాపీగా ఉండాలంటే షారుఖ్ చెప్పిన సీక్రెట్ ఫాలో అవ్వాల్సిందే..

Updated Date - Oct 04 , 2025 | 06:35 PM