Rain Forecast: మరో 3 రోజులు భారీ వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
ABN , Publish Date - May 26 , 2025 | 05:58 PM
Rain Forecast: ఈ నెల 27వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 29వ తేదీలోగా అల్పపీడనం బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మే చివరి వారంలో దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 27,28,29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజమాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సోమవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులు వర్షాలు పడతాయని వెల్లడించింది.
అంతేకాదు.. ఈ నెల 27వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 29వ తేదీలోగా అల్పపీడనం బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మే చివరి వారంలో దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంది. ఆంధ్రప్రదేశ్ మీద ఈ అల్పపీడన ప్రభావం పడనుంది. ఇక, మే 26, 27, 28, 29 తేదీల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావారణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో భారీ వర్షం. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్..
ప్రేమలో మీరు నిజాయితీపరులా లేక మోసగాళ్లా.. ఫొటో చూసి తెలుసుకోండి..