Water Development Scheme: ఐదేళ్లు కాదు.. మూడేళ్లలోనే..!
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:46 AM
గిరిజన భూములను అభివృద్ధి చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో తెచ్చిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం పథకం’ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టనుంది.
మార్పులతో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలు
సెంట్రలైజ్డ్ టెండర్లకు వెళ్లే యోచన
కుసుమ్ మాదిరిగా సబ్సిడీ ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్రం
హైదరాబాద్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గిరిజన భూములను అభివృద్ధి చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో తెచ్చిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం పథకం’ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టనుంది. గతంలో ఉన్న ఐదేళ్ల గడువును మూడేళ్లకు కుదించనుంది. ఈ పథకానికి సంబంధించిన టెండర్ల విధానాన్నీ మార్చనుంది. ప్రస్తుత విధానంలో టెండర్లను జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించగా.. దీనికి బదులు రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత విధానం (సెంట్రలైజ్డ్)లో టెండర్లను ఆహ్వానించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందిర సౌర గిరి జల పథకాన్ని రెండు నెలల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం పథకాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తేగా అధికారుల దృష్టికి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని పలు మార్పులతో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు గతంలో ఇచ్చిన జీవో15ను సవరించి మరో జీవోను విడుదల చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10వేల మంది గిరిజన రైతులకు రూ.600 కోట్ల ఖర్చుతో 27,184 ఎకరాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. 2026-27నుంచి నాలుగేళ్లలో యేటా 50వేల మంది రైతుల చొప్పున రూ.3వేల కోట్లతో 1,43,204 ఎకరాల చొప్పున సాగు యోగ్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ ఐదేళ్ల గడువును మూడేళ్లకు కుదించాలని.. అవసరమైన సోలార్ మోటార్లు, ఇతర పరికరాల కొనుగోళ్లకు సెంట్రలైజ్డ్ టెండర్లు నిర్వహించాలన్న ప్రతిపాదనలు గిరిజన సంక్షేమ శాఖ నుంచి ప్రభుత్వానికి వెళ్లాయి.
30% రాయితీ భరించాలని కేంద్రానికి ప్రతిపాదన
రాష్ట్రంలోని 2.10 లక్షల మంది గిరిజన రైతులకు 6.69లక్షల ఎకరాలకు భూమి యాజమాన్యపు హక్కులు కల్పించారు. ఈ భూములకు ఐదేళ్లలో రూ.12,600 కోట్లతో సాగునీటి సౌకర్యం కల్పించేందుకు సౌరగిరి జల వికాసం పథకాన్ని రూపొందించారు. అయితే పీఎం కుసుమ్ అనే కేంద్ర ప్రభుత్వ పథకం రైతులు సౌరశక్తి ఆధారిత వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 30శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30శాతం చొప్పున సబ్సిడీ అందిస్తాయి. పీఎం కుసుమ్ పథకానికిసబ్సిడీని భరిస్తున్న నేపథ్యంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికీ అంతే సబ్సిడీ చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత
Read latest Telangana News And Telugu News