Share News

Deputy CM Bhatti Vikramarka: వచ్చే ఏడాది నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రారంభం: భట్టి

ABN , Publish Date - Oct 28 , 2025 | 08:56 PM

విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలవాలన్న దృష్టితో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఆ దిశగా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు.

Deputy CM Bhatti Vikramarka: వచ్చే ఏడాది నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రారంభం: భట్టి
Deputy CM Bhatti Vikramarka

ఖమ్మం, అక్టోబర్ 28: రాష్ట్ర విద్యా వ్యవస్థను గేమ్ చేంజర్‌గా మార్చే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో విద్యా రంగంపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలవాలన్న దృష్టితో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. ఆ దిశగా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు.


గ్రామీణ యువత పోటీ పరీక్షల కోసం దూరప్రాంతాలకు వెళ్లి ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డిజిటల్ లైబ్రరీ, నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్‌లైన్ కోచింగ్, పోటీ పరీక్షలకు అవసరమైన మొత్తం స్టడీ మెటీరియల్ ఈ సెంటర్లలో అందుబాటు లోకి తీసుకొస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో ఐదు ప్రదేశాల్లో ఇవి ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేశామని చెప్పారు.


పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని భట్టి (Deputy CM Bhatti Vikramarka) ప్రకటించారు. మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా, పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి మండలంలో మూడు ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతులు, బోధనా సౌకర్యాలు పెంచుతున్నామని స్పష్టం చేశారు.


ప్రతి పది గ్రామాలకు ఒక పాఠశాలను గుర్తించి అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని స్థానిక సీఎస్ఆర్ నిధుల ద్వారా అందించే విధంగా సూచనలు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల పైన సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసి విద్యుత్‌లో స్వయం సమృద్ధిని సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.


ఇవి కూడా చదవండి:

CM Revanth Reddy: హైదరాబాద్‌ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలి: సీఎం రేవంత్‌

Jubilee Hills By Election: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ రిచెస్ట్ ప్లేసే కానీ.. ఎంపీ ఈటల

Updated Date - Oct 28 , 2025 | 08:59 PM