SHG Women: స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా చీర
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:15 AM
స్వయం సహాయక సంఘాల్లో(ఎ్‌సహెచ్‌జీ)ని మహిళలకు ఇందిరా క్రాంతి శక్తి పథకంలో భాగంగా దసరా పండుగకు చీరలను పంపిణీ చేయాలని, మళ్లీ నాలుగైదు నెలల తర్వాత మరో చీరను ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
నాలుగైదు నెలల తర్వాత మరొకటి
ఇందిరా క్రాంతి శక్తి పథకంలో భాగంగా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం!
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాల్లో(ఎ్‌సహెచ్‌జీ)ని మహిళలకు ఇందిరా క్రాంతి శక్తి పథకంలో భాగంగా దసరా పండుగకు చీరలను పంపిణీ చేయాలని, మళ్లీ నాలుగైదు నెలల తర్వాత మరో చీరను ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 65లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలంటే 1.30కోట్ల చీరలు అవసరం. ఈ మొత్తం చీరలన్నింటినీ తెలంగాణలోని నేత కార్మికులతోనే తయారు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చీరల కోసం 4.5కోట్ల మీటర్ల మేర క్లాత్ అవసరమని అంచనా వేసింది. అలాగే చీరల డిజైన్‌ను కూడా ఖరారు చేసింది. వివాదాలకు తావు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చీరలను ఒకే డిజైన్‌లో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. చీరలకు రూ.636 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. చీరల పంపిణీ మధ్య నాలుగైదు నెలల వ్యవధి ఉంటే నేత కార్మికులపై అధిక భారం పడకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లకు అవసరమైన వస్త్రాల తయారీ బాధ్యతను కూడా రాష్ట్రంలోని నేత కార్మికులకే ఇచ్చేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకున్నది. అలాగే టెస్కో నుంచి కూడా వస్త్రాల ఉత్పత్తికి అవసరమైన ఆర్డర్‌లను నేత కార్మిక సంఘాలకు ఇస్తోంది. ఇలా ఏడాది పొడవునా చేనేత కార్మికులకు పని కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 32వేలకు పైగా మరమగ్గాలున్నాయి. వీటిపై సుమారు 10వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే చీరలను నేసేందుకు అవసరమైన నూలును కూడా ప్రభుత్వం క్రెడిట్ విధానంలో అందించేలా చర్యలు తీసుకుంది. నూలు మొత్తం ఖరీదులో 10ు కార్మికులు చెల్లిస్తే.. మిగిలిన 90శాతాన్ని క్రెడిట్ కింద ప్రభుత్వం అందిస్తోంది. పని పూర్తై, బిల్లులు ఇచ్చిన తరువాత వారి నుంచి ప్రభుత్వం ఇచ్చిన 90శాతాన్ని రికవరీ చేసుకుంటోంది. ఈ విధానంతో కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటును కల్పిస్తోంది.
చీరల తయారీ వేగం పెంచండి: తుమ్మల
స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే చీరల డిజైన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పరిశీలించారు. చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాయలంలో చేనేత, జౌళి శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేపట్టబోయే ‘వస్త్ర ప్రదర్శన’ వేడుక ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలన్నారు. చేనేత రుణమాఫీ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి, వారి ఖాతాలలో రుణ మాఫీ నిధులు జమ చేయాలన్నారు. ఈ సమీక్షలో జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యార్, అధికారులు పాల్గొన్నారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News