Water Resources: ఇచ్చంపల్లితోనే బనకచర్లకు చెక్!
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:45 AM
గోదావరి-కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి, అక్కడి నుంచి నీటిని తరలించాలనే ప్రతిపాదనపై చర్చించటం కోసం ఈ నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు జలసౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ సమావేశం కానుంది.
అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం..తొలుత ఇచ్చంపల్లిపై అభ్యంతరాలు
సమీపంలో తుపాకులగూడెం ప్రాజెక్టు.. వరద కట్టడి సాధ్యం కాదని వాదన
బనకచర్ల అనుసంధానం నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిలో మార్పు
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి, అక్కడి నుంచి నీటిని తరలించాలనే ప్రతిపాదనపై చర్చించటం కోసం ఈ నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు జలసౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీతో పాటు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కి కూడా చైర్మన్‌గా ఉన్న అతుల్ జైన్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. తాజాగా ఇచ్చంపల్లి రిజర్వాయర్ నుంచే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు వినతిపత్రాన్ని కూడా అందించింది. ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌కు ఆమోదం తెలపడం ద్వారా గోదావరి-బనకచర్ల అనుసంధానానికి చెక్ పెట్టినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కింద 300 టీఎంసీలను తరలించడానికి ఏపీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలని పట్టుబడుతూ వచ్చిన ఏపీ.. తాజాగా రూటు మార్చింది. బొల్లాపల్లి నుంచి అనుసంధానం చేపట్టాలని కేంద్రానికి నివేదించడమే కాకుండా ఒత్తిడి పెంచుతోంది.
ఈ నేపథ్యంలోనే ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్‌డబ్ల్యూడీఏ ఆహ్వానం పంపింది. వాస్తవానికి, గత కొన్నేళ్లుగా ఇచ్చంపల్లిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇచ్చంపల్లి నుంచి కేవలం 24 కి.మీ.ల దిగువలోనే తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ ఉంది. ఇచ్చంపల్లి నుంచి వరద నీటిని ఆకస్మికంగా విడుదల చేయాల్సి వస్తే.. ఆ వరదను నియంత్రించే పరిస్థితులు ఉండబోవని, రెండు బ్యారేజీల మధ్య కేవలం 24 కి.మీ.ల దూరమే ఉన్నందున ఫ్లడ్‌రూటింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇచ్చంపల్లికి దిగువన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీల నీటి వినియోగం ఉందని, ఇచ్చంపల్లి రిజర్వాయర్ కడితే ఈ ప్రాజెక్టుల అవసరాలు తీర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అయితే, ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధానం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఏపీకి ముకుతాడు వేయాలంటే ఇచ్చంపల్లి ఒక్కటే మార్గమనే భావనతో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News