National Best Teacher Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పవిత్ర
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:44 AM
తెలంగాణ ఉపాధ్యాయురాలు మారం పవిత్రకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. కేంద్ర విద్యా శాఖ 2025కి గాను మొత్తం 45 మందికి అవార్డులు ప్రకటించగా..
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ జడ్పీహెచ్‌ఎస్లో జీవశాస్త్రం టీచరు
సాంకేతికతను మేళవించి బోధన
దేశవ్యాప్తంగా 45 మందికి అవార్డులు
సూర్యాపేట(కలెక్టరేట్)/హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉపాధ్యాయురాలు మారం పవిత్రకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. కేంద్ర విద్యా శాఖ 2025కి గాను మొత్తం 45 మందికి అవార్డులు ప్రకటించగా.. రాష్ట్రం నుంచి పవిత్ర ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లను పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించగా.. మారం పవిత్రను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ ఉన్నత పాఠశాలలో ఆమె జీవశాస్త్రం బోధిస్తున్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పవిత్ర.. బోధనలో తనకంటూ ప్రత్యేకత శైలిని అనుసరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీక్ష పోర్టల్‌లో 99 వీడియో పాఠాలను అప్‌లోడ్ చేశారు. సాంకేతికతను ఉపయోగించి పాఠాలు బోధిస్తూ విద్యార్థులకు జీవశాస్త్రంపై ఆసక్తి పెంచుతున్నారు. డిజిటల్ బోర్డులపై పాఠాలు ఇతర పాఠశాలలకు స్పూర్తిగా నిలుస్తున్నాయి. ఆటలతో నేర్చుకోవడం కోసం 40 కార్డుబోర్డు గేమ్స్‌ను సొంతంగా రూపొందించారు. తక్కువ ఖర్చుతో బోధనోపకరణాలను తయారుచేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. పవిత్ర ఆధ్వర్యంలో అనేకమంది విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. పవిత్ర రూపొందించిన పరిశోధనా పత్రం బ్రిటిష్ కౌన్సిల్ సంచికలో ప్రచురితమైంది. ప్రస్తుతం పదోతరగతిలో ఉన్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, హోమ్ సైన్స్ పుస్తకాల రచయితల్లో ఈమె కూడా ఒకరు. పవిత్ర భర్త నాతాల మన్మధరెడ్డి సైతం ప్రభుత్వం ఉపాధ్యాయుడే. ‘మాది వ్యవసాయ కుటుంబం. చిన్నతనంలోనే నాన్న మరణించడంతో అమ్మే నన్ను చదివించారు. డిగ్రీ సెకండ్ ఇయర్‌లో వివాహం జరిగింది. నా భర్త ప్రోత్సాహంతో డీఎస్సీలో ఎంపికయ్యా’ అని పవిత్ర చెప్పారు. తనకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన మారం పవిత్రను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్, సూర్యాపేట కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ అభినందించారు. కాగా, ఏపీలోని విశాఖకు చెందిన ఉపాధ్యాయురాలు శ్రీదేవికి కూడా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. ఈ అవార్డులను ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News