Telangana JEE Toppers: జేఈఈ టాపర్లలో మనోళ్లు నలుగురు
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:48 AM
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం 2,50,236 మంది అర్హత సాధించారు, తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది.
తెలంగాణ నుంచి ముగ్గురు విద్యార్థులకు..
ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి 100 పర్సంటైల్
ఏడుగురితో రాజస్థాన్ టాప్.. 2వ స్థానంలో తెలంగాణ
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2,50,236 మంది అర్హత
ఓపెన్ క్యాటగిరీలో 93.10 పర్సంటైల్ వరకు..
ఓబీసీ కటాఫ్ 79.43, ఎస్సీలకు 61.15 పర్సంటైల్
ఎస్టీ క్యాటగిరీలో 47.90 పర్సంటైల్ వరకు చాన్స్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ సెషన్-2 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. సెషన్-1లో తెలంగాణ నుంచి ఒకరు ఈ ఘనత సాధించగా.. రెండో విడత ఫలితాల్లో ఈ సంఖ్య ముగ్గురికి చేరింది. వంద పర్సంటైల్ సాధించిన తెలంగాణ విద్యార్థుల్లో హర్ష్ ఎ.గుప్తా, వంగాల అజయ్‌రెడ్డి, బానిబ్రతా మాజీ ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన బానిబ్రతా మాజీ.. సెషన్-1లోనూ 100 పర్సంటైల్ సాధించారు. కాగా, హైదరాబాద్ విద్యార్థి వంగాల అజయ్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్ విభాగంలో టాపర్‌గా నిలిచాడు. మొదటి విడతలో వంద పర్సంటైల్ సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయిమనోజ్ఞ గుత్తికొండ రెండో విడతలోనూ అదే స్థాయిలో సత్తా చాటింది. మొత్తంగా వంద పర్సంటైల్ సాధించిన 24 మందిలో ఏడుగురితో రాజస్థాన్ రాష్ట్రంమొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ, మహారాష్ట్ర చెరో మూడు ర్యాంకులు సాధించి రెండో స్థానంలో నిలిచాయి. ఇక.. జేఈఈ మొదటి, రెండోవిడతలో వచ్చిన పర్సంటైల్ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అర్హతకు కటాఫ్ మార్కులను ఎన్టీఏ ప్రకటించింది.
అడ్వాన్స్‌డ్‌కు మొత్తం 2,50,236 మంది అర్హత సాధించినట్లు పేర్కొంది. అన్‌రిజర్వుడ్ క్యాటగిరీలో 100 నుంచి 93.10 పర్సంటైల్ సాధించిన 97,321 విద్యార్థులను అర్హులుగా ప్రకటించింది. అలాగే ఓబీసీలో 93.09 నుంచి 79.43 పర్సంటైల్ సాధించిన 67,614 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు తెలిపింది. ఎస్సీ విభాగంలో 93.09 నుంచి 61.15 పర్సంటైల్ సాధించిన 37,519 మంది విద్యార్థులు అర్హులుగా పేర్కొంది. ఈడబ్ల్యూఎస్‌లో 93.09 నుంచి 80.38 పర్సంటైల్ సాధించిన 25,009 మంది, ఎస్‌టీలో 93.09 నుంచి 47.90 సాధించిన 18,823 మంది తదుపరి పరీక్షకు అర్హత సాధించారు.
3,950 మంది వికలాంగులకు అవకాశం..
ఈసారి జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరైన వికలాంగుల్లో 91.56 శాతం మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందారు. మొత్తం 4,314 మంది హాజరుకాగా.. వీరిలో 3,950 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. జేఈఈ పరీక్షలో వికలాంగ విద్యార్థులకూ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈసారి కనీస కటాఫ్ స్కోర్‌ను 0.0079349కి తగ్గించామని ఎన్టీఏ తెలిపింది. కాగా, జేఈఈ రెండో విడతలో మొత్తం 133 మంది విద్యార్థుల ఫలితాలను ప్రకటించలేదు. వీరిలో 110 మంది పరీక్షలో అనైతిక పద్ధతులు పాటించినందుకు, మరో 23 మంది ఫొటోలు, బయోమెట్రిక్‌లో సమస్యలు ఉండటంతో తాత్కాలికంగా (విత్‌హెల్డ్) నిలిపివేశారు. తాము కోరిన వివరాలు నిర్దిష్ట కాలపరిమితిలో సమర్పిస్తే ఫలితాలు విడుదల చేస్తామని ఎన్టీఏ తెలిపింది.
గిరిజన ఐఐటీ స్టడీ సెంటర్ విద్యార్థుల ప్రతిభ
రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గిరిజన ఐఐటీ స్టడీ సెంటర్‌కు చెందిన 41 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో ఉత్తమ పర్సంటైల్ సాధించి అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందారు. మెయిన్ ఫలితాల్లో ఏడుగురు 90 నుంచి 96 పర్సంటైల్ సాధించగా, 13 మంది 80 నుంచి 90 లోపు పర్సంటైల్ సాధించారు. మాదాపూర్‌లోని గౌలిదొడ్డి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో శిక్షణ పొందిన విద్యార్థుల్లో 15 మంది 90 పర్సంటైల్, 67 మంది 70 నుంచి 80 పర్సంటైల్ సాధించినట్లు అధికారులు తెలిపారు. అక్కడే శిక్షణ పొందిన బాలికల్లో 62 మంది క్వాలిపై కాగా, అక్షర అనే విద్యార్థిని 95.74, భవ్యశ్రీ 95.75 పర్సంటైల్‌తో ప్రతిభ కనబరిచారని వెల్లడించారు.
ముంబై ఐఐటీలో సీటే లక్ష్యం
ముంబై ఐఐటీలో సీఎ్‌సఈ సీటు సాధించడమే తన లక్ష్యమని వంగా అజయ్‌రెడ్డి తెలిపారు. జేఈఈ మొదటి సెషన్‌లో 99.996 పర్సంటైల్ రాగా, రెండవ సెషన్‌లో 100 పర్సంటైల్ లభించిందని తెలిపాడు. కళాశాల నిర్వహించే మాక్ టెస్ట్‌లకు నిరంతరం హాజరవుతూనే, రోజుకు దాదాపు 10 గంటలు చదివానని చెప్పాడు. తన ప్రిపరేషన్‌కు కళాశాల అధ్యాపకులు సంపూర్ణంగా తోడ్పాటునందించారని పేర్కొన్నాడు. ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుతున్న సోదరుడే తనకు స్ఫూర్తి అని, అతను అందించిన ప్రిపరేషన్ చిట్కాలు ఫస్ట్ ర్యాంకు సాధనకు బాగా ఉపయోగపడ్డాయని తెలిపాడు. సెలవు రోజుల్లో మినహా ఇతర వ్యాపకాల జోలికి పోలేదన్నాడు. తన తండ్రి వెంకటరమణారెడ్డి కర్నూలులో కిచెన్ అప్లయెన్సెస్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, మరో టాపర్ బానిబ్రతా మాజీ కూడా ముంబై లేదా ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సీటు సాధించడమే లక్ష్యమని చెప్పాడు. హైటెక్స్ జోన్ నారాయణ క్యాంపస్‌లో ఇంటర్మీడియట్ చదివినట్లు తెలిపాడు. స్వరాష్ట్రం పశ్చిమబెంగాల్ కాగా, తండ్రి కోల్‌కతాలోని డీఆర్‌డీవోలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారని, తల్లి గృహిణి అని వెల్లడించాడు. జేఈఈ అడ్వాన్డ్ పరీక్షలో టాప్ 1 లేదా 2 ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పాడు. రోజుకు 12 నుంచి 14 గంటలపాటు చదువుకు కేటాయిస్తున్నానని, ఒత్తిడి నుంచి బయటపడడానికి విరామ సమయంలో చెస్, టేబుల్ టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్ ఆడతానని చెప్పారు.

ఎస్టీ క్యాటగిరీలో ఖమ్మం విద్యార్థికి 5వ ర్యాంక్
ఖమ్మం ఖానాపురం హవేలి: ఏఈఈ మెయిన్ ఫలితాల్లో ఖమ్మం నగరానికి చెందిన అజ్మీరా రోషిక్ మణిదీప్ ఎస్టీ క్యాటగిరీలో ఆలిండియా 5వ ర్యాంకు సాధించాడు. ఓపెన్ క్యాటగిరిలో 1765వ ర్యాంకు సాధించాడు. రోషిక్ మణిదీప్ దండ్రి అజ్మీర బాలాజీ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, తల్లి నీలాబాయి గృహిణిగా ఉన్నారు.

అత్యుత్తమ ఐఐటీలో సీటే లక్ష్యం..
జేఈఈ అడ్వాన్స్‌లోనూ మెరుగైన ర్యాంకు సాధించి అత్యుత్తమ ఐఐటీలో ఈసీఈ సీటు సాధించడమే లక్ష్యం. ప్రణాళిక ప్రకారం రోజుకు 12 గంటలకుపైగా చదువుతూ పరీక్షకు సిద్ధమయ్యా. అధ్యాపకులు ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తూ లక్ష్యం కోసం కృషి చేశా. పదవ తరగతిలో 588, ఇంటర్‌లో 987 మార్కులు సాధించా. తల్లి గుత్తికొండ పద్మజ ప్రైవేటు ఆస్పత్రిలో ఏవోగా పనిచేస్తున్నారు. తండ్రి కిశోర్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్.
- గుత్తికొండ సాయిమనోజ్ఞ 18వ ర్యాంకర్
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News