Share News

Naveen Mittal: ల్యాండ్‌ గవర్నెన్స్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ లీగల్‌ సపోర్ట్‌ సెల్‌ ఏర్పాటు

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:58 AM

ల్యాండ్‌ గవర్నెన్స్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ లీగల్‌ సపోర్ట్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తూ భూ పరిపాలనా విభాగం(సీసీఎల్‌ఏ) ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Naveen Mittal: ల్యాండ్‌ గవర్నెన్స్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ లీగల్‌ సపోర్ట్‌ సెల్‌ ఏర్పాటు

  • సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ

  • ఈ కమిటీ ద్వారానే భూభారతి నిబంధనల రూపకల్పన!

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ల్యాండ్‌ గవర్నెన్స్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ లీగల్‌ సపోర్ట్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తూ భూ పరిపాలనా విభాగం(సీసీఎల్‌ఏ) ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూపరిపాలన ప్రధాన కార్యాలయం కేంద్రంగా పని చేసే ఈ లీగల్‌ సెల్‌లో ప్రధాన సలహాదారు, మరో ఇద్దరు సలహాదారులు సహా ముగ్గురు సభ్యులుంటారు. భూపరిపాలన వ్యవహారాలకు సంబంధించి న్యాయ పరిశోధన, విధానాల రూపకల్పన, చట్టాలు, నిబంధనలు, నియంత్రణకు సంబంధించిన ఉత్తర్వులు, ఇతర సర్క్యులర్ల తయారీ, భూపరిపాలనకు సంబంధించి ఉత్తమ విధానాల అధ్యయనం, సలహాలు, సూచనలు చేయడం, న్యాయపరమైన సందేహాలు తలెత్తినప్పుడు పరిష్కార మార్గాలు చూపడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతలు.


అంతేకాక, పెండింగ్‌లో ఉన్న భూసమస్యల విషయంలో న్యాయ సలహాలిచ్చే బాధ్యత కూడా ఈ సెల్‌కు ఉంటుంది. త్వరలో అమలులోకి రానున్న భూభారతి చట్టానికి సంబంధించిన నిబంధనల రూపకల్పన కూడా ల్యాండ్‌ గవర్నెన్స్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ లీగల్‌ సపోర్ట్‌ సెల్‌ ఆధ్వర్యంలో జరగనున్నట్టు తెలిసింది. కాగా, భూభారతి చట్టంలో సహకారం అందించిన న్యాయవాది భూమి సునీల్‌ను లీగల్‌సెల్‌ ప్రధాన న్యాయ సలహాదారుగా నియమించే అవకాశముందని సమాచారం. ఒకటి, రెండు రోజుల్లోనే దీని పై ఉత్తర్వులు వెలువడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 04:58 AM