Share News

Abortion Rate: రాష్ట్రంలో గంటకు 2 అబార్షన్లు

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:22 AM

రాష్ట్రంలో ప్రతీ గంటకు సగటున రెండు అబార్షన్లు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణలో గర్భ విచ్ఛిత్తి రేటు ఏకంగా 917.68 శాతం పెరిగింది.

Abortion Rate: రాష్ట్రంలో గంటకు 2 అబార్షన్లు

  • ఐదేళ్లలో 917.68 శాతం పెరుగుదల.. గర్భవిచ్ఛిత్తిలో దేశంలోనే అగ్రస్థానం

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతీ గంటకు సగటున రెండు అబార్షన్లు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణలో గర్భ విచ్ఛిత్తి రేటు ఏకంగా 917.68 శాతం పెరిగింది. 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నమోదైన మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంట్‌కు నివేదించింది. తెలంగాణలో 2020-21లో 1,578 ఎంటీపీలు జరగ్గా.. 2024-25 నాటికి ఆ సంఖ్య 16,059కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో ఎంటీపీల పెరుగుదలలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. అలాగే 2020-21లో అన్ని రాష్ట్రాల్లో కలిపి 5,34,008 ఎంటీపీలు జరగ్గా.. 2024-25 నాటికి ఆ సంఖ్య 8,93,372కు చేరింది. అంటే దేశవ్యాప్తంగా గర్భస్రావాల పెరుగుదల ఐదేళ్లలో 67 శాతం పెరిగింది.


టాప్‌లో 4 దక్షిణాది రాష్ట్రాలు..

ఎంటీపీల టాప్‌ జాబితాలో నాలుగు దక్షిణాది రాష్ట్రాలున్నాయి. 917.6 శాతం పెరుగుదలతో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ, 371 శాతం పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత కేరళ(203 శాతం), కర్ణాటక(156 శాతం) ఉన్నాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో 158 శాతంతో రాజస్థాన్‌ అగ్రస్థానంలో, 132 శాతంతో బిహార్‌ రెండో స్థానంలో ఉన్నాయి. కాగా 2024-25లో లక్షకు పైగా ఎంటీపీలు జరిగిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. ఆ రాష్ట్రంలో 2,07,019 ఎంటీపీలు జరిగాయి. అసాధారణ రీతిలో అబార్షన్ల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం రిపోర్టింగేనని వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతీ నెలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే ఎంటీపీల వివరాలను డీఎంహెచ్‌వోలకు పంపాలి. వాటిని విధిగా హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(హెచ్‌ఎమ్‌ఐఎ్‌స)లో నమోదు చేయాలి. గతంలో ఏడు వారాల్లోపు గర్భవిచ్ఛిత్తి అయ్యే వివరాలను నమోదు చేసేవారు కాదు. ఇప్పుడు ఆ వివరాలను నమోదు చేస్తున్నారు. అలాగే శస్త్రచికిత్స ద్వారా చేసే అబార్షన్లనే గర్భవిచ్ఛిత్తి కేసులుగా నమోదు చేసేవారు. ఇప్పుడు మందుల ద్వారా అబార్షన్‌ అయ్యే వివరాలను కూడా చూపుతున్నారు. ప్రస్తుతం ఇవన్నీ పక్కాగా లెక్కల్లో చూపడం వల్లనే మన దగ్గర ఎంటీపీలు అధికంగా నమోదవుతున్నాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. గతంలో గర్భం దాల్చిన 24 వారాలకు టిఫా స్కానింగ్‌ చేసేవారు. ఇందులో శిశువుకు ఏ చిన్న లోపం ఉన్నా బయటపడేది. ఇప్పుడు 12-14 వారాలకే చేయించుకుంటున్నారు. ప్రస్తుతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీంతో మూడు నెలలకే శిశువు పెరుగుదల, అనారోగ్యం, అవయవ లోపాలు ఆ స్కానింగ్‌తో బయటపడుతున్నాయి. గతంలో రేడియాలజిస్టులే స్కానింగ్‌ చేసేవారు. ప్రస్తుతం ఫీటల్‌ మెడిసిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఫీటల్‌ స్పెషలిస్టులు స్కానింగ్‌ చేసి, మూడు నెలల గర్భంలోని శిశువుల్లో లోపాలను చెప్పేస్తున్నారు. దాంతో తల్లిదండ్రులు ఎంటీపీకి మొగ్గుచూపుతున్నారు.


ఐదేళ్లలో నమోదైన ఎంటీపీలు

2020-21 2021-22 2022-23 2023-24 2024-25

తెలంగాణ 1578 3114 4071 12365 16059

ఆంధ్రప్రదేశ్‌ 2282 9119 8446 8949 10676

కేరళ 8525 10989 14519 20179 25884

శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు

ఎంటీపీల రిపోర్టింగ్‌ ఇప్పుడు పక్కాగా ఉంటోంది. అందుకే వాటి సంఖ్య పెరిగింది. శిశువులో ఏ చిన్న లోపం ఉన్నా తల్లిదండ్రులు గర్భవిచ్ఛిత్తికే మొగ్గు చూపుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలనుకుంటున్నారు. ఎంటీపీ చట్టాన్ని సవరించిన తర్వాత 24 వారాల వరకు అబార్షన్‌ చేసే అవకాశం కలిగింది. గతంలో ఇది 14 వారాల వరకే ఉండేది. ప్రస్తుతం ఆలస్యంగా వివాహాలు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. బీపీ, షుగర్‌, ఇతర అనారోగ్య సమస్యలతో గర్భం ధరించడం ఎంటీపీలకు కారణమవుతోంది.

- డాక్టర్‌ ప్రశాంతి, సీనియర్‌ గైనకాలజిస్టు, రెయిన్‌బో ఆస్పత్రి, వరంగల్‌


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 04:22 AM