Irrigation Projects: కేంద్రం సహాయానికి దారేదీ?
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:14 AM
కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ప్రాజెక్టులకు కీలక అనుమతులు సాధించినప్పటికీ వాటికి కేంద్ర సహాయం కోరే దిశగా అధికారుల అడుగులు పడటం లేదు.
సీఎం, మంత్రి ఆదేశించినా నాలుగు ప్రాజెక్టులకు ‘ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్’ తీసుకోని అధికారులు
టీఏసీ అనుమతి వచ్చినా ముందుకు పడని అడుగులు
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ప్రాజెక్టులకు కీలక అనుమతులు సాధించినప్పటికీ వాటికి కేంద్ర సహాయం కోరే దిశగా అధికారుల అడుగులు పడటం లేదు. రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుతో పాటు చనాకా కొరాటా, మొడికుంటవాగు, చిన్నకాళేశ్వరం (ముక్తేశ్వర్) ప్రాజెక్టులకు కీలకమైన సాంకేతిక సలహా మండలి (టీఏసీ) అనుమతులు లభించాయి. దాంతో ఈ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సింఛాయ్ యోజన (పీఎంకేఎ్‌సవై-ఏఐబీపీ) కింద సహాయం కోరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఏ ప్రాజెక్టుకు కేంద్ర సహాయం పొందాలన్నా విధిగా సీడబ్ల్యూసీ నుంచి ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇది లేకపోతే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వదు. చనాకా కొరాటా కింద రూ.173 కోట్లు, మొడికుంటవాగు కోసం రూ.463 కోట్లు, చిన్నకాళేశ్వరం(ముక్తేశ్వర్) ఎత్తిపోతల పథకానికి రూ.233 కోట్లు కలిపి మొత్తం రూ.869 కోట్లు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని తొలుత నిర్ణయించారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ కోసం కసరత్తు చేపట్టలేదు. ఏఐబీపీ కింద కేంద్రం 60 శాతం నిధులు సమకూరిస్తే రాష్ట్రం 40 శాతం భరించాల్సి ఉంటుంది.